కల చెదిరింది

కల చెదిరింది– భారత్‌ 240/10, ఆస్ట్రేలియా 241/4
– ఐసీసీ 2023 ప్రపంచకప్‌
– ఆసీస్‌ చేతిలో మళ్లీ భంగపాటు
– ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఓటమి
– ఆరోసారి చాంపియన్‌గా ఆస్ట్రేలియా
– ఛేదనలో ట్రావిశ్‌ హెడ్‌ మెరుపు సెంచరీ
కల చెదిరింది. కన్నీరే ఇక మిగిలింది. 2023 ప్రపంచకప్‌ టీమ్‌ ఇండియా చేజారింది. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ చేతిలో ఓడిన టీమ్‌ ఇండియా.. సొంతగడ్డపై 2023 ప్రపంచకప్‌ తుది పోరులోనూ నిరాశపరిచింది. ప్రపంచకప్‌లో ఫైనల్లో భారత్‌కు ఇది రెండో ఓటమి.
అజేయ ప్రస్థానానికి ఊహించని ముగింపు. ఆతిథ్య జట్టుగా ప్రపంచకప్‌లో వరుసగా పది మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా.. టైటిల్‌ ముంగిట ఫైనల్లో బోల్తా పడింది. ‘టాస్‌’ పాత్ర గణనీయంగానే ఉన్నప్పటికీ బ్యాట్‌తో ఆతిథ్య జట్టు అంచనాలను అందుకోలేదు. సెమీఫైనల్‌ వరకు ప్రత్యర్థులను అన్ని విభాగాల్లో చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. టైటిల్‌ పోరులో మాత్రం ఆసీస్‌ చేతిలో అన్ని విభాగాల్లో తేలిపోయింది!.
ఆస్ట్రేలియా సిక్సర్‌. ఐసీసీ ప్రపంచకప్‌ టైటిల్‌ మరోసారి కంగారూ గూటికి చేరుకుంది. అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌, మైకల్‌ క్లార్క్‌ సరసన పాట్‌ కమిన్స్‌ నిలిచాడు. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన తొలి, ఓవరాల్‌గా మూడో బౌలర్‌, కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో పేసర్లు కపిల్‌ దేవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రమే కెప్టెన్‌గా ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుపొందారు. ఏడాది ఆరంభంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. ఏడాది ఆఖర్లో ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియాకు తీరని వేదన మిగిల్చింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
ఆతిథ్య భారత్‌ ఆశలు ఆవిరి. 2023 ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ఆస్ట్రేలియా రికార్డు ఆరో వరల్డ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ (137, 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా, మార్నస్‌ లబుషేన్‌ (58 నాటౌట్‌, 110 బంతుల్లో 4 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో సమయోచిత ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. హెడ్‌, లబుషేన్‌ నాల్గో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 43 ఓవర్లలోనే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది. కెఎల్‌ రాహుల్‌ (66, 107 బంతుల్లో 1 ఫోర్‌), విరాట్‌ కోహ్లి (54, 63 బంతుల్లో 4 ఫోర్లు), రోహిత్‌ శర్మ (47, 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో మెరుపు సెంచరీతో విశ్వరూపం చూపించిన ట్రావిశ్‌ హెడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
ట్రావిశ్‌ హెడ్‌ అదుర్స్‌
ఛేదనలో ఆసీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. డెవిడ్‌ వార్నర్‌ (7), మిచెల్‌ మార్ష్‌ (15), స్టీవ్‌ స్మిత్‌ (4)లు బుమ్రా, షమి దెబ్బకు పెవిలియన్‌కు చేరారు. 47/3తో ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడింది. కానీ ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ మరో ఎండ్‌లో ధ్వంస రచన సాగించాడు. సహజ శైలికి విరుద్ధంగా పవర్‌ప్లేలో కాస్త నెమ్మదించిన హెడ్‌.. ఆ తర్వాత విరుచుకు పడ్డాడు. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌లపై భారీ షాట్లు ఆడాడు. పరుగుల రాకతో ఆసీస్‌ శిబిరం తేలికపడింది. మార్నస్‌ లబుషేన్‌ మరో ఎండ్‌ నుంచి హెడ్‌కు చక్కటి సహకారం అందించాడు. స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ భారత బౌలర్ల ఉత్సాహాన్ని నీరుగార్చాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో హెడ్‌ అర్థ సెంచరీ సాధించగా.. 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 95 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. మార్నస్‌ లబుషేన్‌ మూడు ఫోర్ల అండతో 99 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. మిడిల్‌ ఓవర్లలో మంచు ప్రభావంతో భారత బౌలర్లు తేలిపోగా.. హెడ్‌, లబుషేన్‌ పరుగులు పిండుకున్నారు. ఈ జోడీని విడదీయటంలో విఫలమైన భారత్‌.. ప్రపంచకప్‌ టైటిల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఖర్లో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (2 నాటౌట్‌) గెలుపు పరుగులతో ఆసీస్‌ శిబిరంలో సంబురాలకు తెరతీశాడు.
మెరిసిన ఆ ముగ్గురు
టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఫైనల్లో ఆతిథ్య టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (47) తనదైన దూకుడుతో ఇన్నింగ్స్‌ను మొదలెట్టాడు. ఆసీస్‌ ఫీల్డర్లు బౌండరీలు నిలువరించినా.. రోహిత్‌ శర్మ దంచికొట్టాడు. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఆసీస్‌ శిబిరంలో గుబులు పుట్టించాడు. ఓ ఎండ్‌లో గిల్‌ (4) తడబాటుకు గురైనా రోహిత్‌ మాత్రం అలవోకగా బౌండరీలు బాదాడు. ఆరంభంలోనే స్లిప్స్‌లో జీవనదానం పొందిన గిల్‌.. అవకాశం వృథా చేసుకున్నాడు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన షార్ట్‌ బాల్‌కు సర్కిల్‌ లోపలే క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. మాక్స్‌వెల్‌పై భారీ సిక్సర్‌తో అర్థ సెంచరీ ముంగిట నిలిచిన రోహిత్‌ శర్మ.. అదే ఓవర్లో ట్రావిశ్‌ హెడ్‌ కండ్లుచెదిరే క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. దీంతో పవర్‌ప్లేలోనే టీమ్‌ ఇండియా ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. రోహిత్‌ శర్మ దూకుడుతో పవర్‌ప్లేలో టీమ్‌ ఇండియా దండిగా పరుగులు చేసింది. తొలి పది ఓవర్లలో భారత్‌ 80/2తో నిలిచింది.
స్లో పిచ్‌పై పవర్‌ప్లే తర్వాత భారత్‌కు పెద్దగా కలిసిరాలేదు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (4) నిష్క్రమణతో టీమ్‌ ఇండియా శిబిరం ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో విరాట్‌ కోహ్లి (54), కెఎల్‌ రాహుల్‌ (66) భారత్‌కు మంచి స్కోరు అందించారు. పరుగుల వేట కష్టమైన దశలో వికెట్‌ నిలుపుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్‌ప్లే అనంతరం ఏకంగా 97 బంతుల పాటు బౌండరీ రాకపోవటంతో స్కోరు బోర్డు పిచ్‌ కంటే ఎక్కువగా నెమ్మదించగా.. ఆసీస్‌ బౌలర్లలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. క్రీజులో కుదురుకున్న విరాట్‌ కోహ్లి నాలుగు బౌండరీలతో 56 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. కమిన్స్‌ ఓవర్లో బంతిని వికెట్లపైకి ఆడుకున్న కోహ్లి అనూహ్యంగా నిష్క్రమించి అభిమానుల్లో నైరాశ్యం నింపాడు. కోహ్లి నిష్క్రమణ తర్వాత రాహుల్‌ మరింత నెమ్మదించాడు. ఓ ఫోర్‌తో 86 బంతుల్లో అర్థ సెంచరీ సాధించినా.. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా (9) నిరాశపరిచాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (18)కు స్లో బౌన్సర్లతో పరీక్ష పెట్టిన ఆసీస్‌ ఆ దిశగా విజయవంతమైంది. టెయిలెండర్లలో కుల్దీప్‌ యాదవ్‌ (10), మహ్మద్‌ సిరాజ్‌ (9 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. 50 ఓవర్లలో ఆలౌటైన భారత్‌ 240 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లు పడగొట్టగా. జోశ్‌ హేజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ రెండేసి వికెట్లు తీశాడు. స్పిన్నర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆడం జంపా పరుగుల పొదుపుతో చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) హెడ్‌ (బి) మాక్స్‌వెల్‌ 47, శుభ్‌మన్‌ గిల్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 4, విరాట్‌ కోహ్లి (బి) కమిన్స్‌ 54, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) ఇంగ్లిశ్‌ (బి) కమిన్స్‌ 4, కెఎల్‌ రాహుల్‌ (సి) ఇంగ్లిశ్‌ (బి) స్టార్క్‌ 66, రవీంద్ర జడేజా (సి) ఇంగ్లిశ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 9, సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) ఇంగ్లిశ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 18, మహ్మద్‌ షమి (సి) ఇంగ్లిశ్‌ (బి) స్టార్క్‌ 6, జశ్‌ప్రీత్‌ బుమ్రా (ఎల్బీ) జంపా 1, కుల్దీప్‌ యాదవ్‌ రనౌట్‌ 10, మహ్మద్‌ సిరాజ్‌ నాటౌట్‌ 9, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (50 ఓవర్లలో ఆలౌట్‌) 240.
వికెట్ల పతనం : 1-30, 2-76, 3-81, 4-148, 5-178, 6-203, 7-211, 8-214, 9-226, 10-240.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 10-0-55-3, జోశ్‌ హేజిల్‌వుడ్‌ 10-0-60-2, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ 6-0-35-1, పాట్‌ కమిన్స్‌ 10-0-34-2, ఆడం జంపా 10-0-44-1, మిచెల్‌ మార్ష్‌ 2-0-5-0, ట్రావిశ్‌ హెడ్‌ 2-0-4-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ (సి) కోహ్లి (బి) షమి 7, ట్రావిశ్‌ హెడ్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 137, మిచెల్‌ మార్ష్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 15, స్టీవ్‌ స్మిత్‌ (ఎల్బీ) బుమ్రా 4, మార్నస్‌ లబుషేన్‌ నాటౌట్‌ 58, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (43 ఓవర్లలో 4 వికెట్లకు) 241.
వికెట్ల పతనం : 1-16, 2-41, 3-47.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 9-2-43-2, మహ్మద్‌ షమి 7-1-47-1, రవీంద్ర జడేజా 10-0-43-0, కుల్దీప్‌ యాదవ్‌ 10-0-56-0, మహ్మద్‌ సిరాజ్‌ 7-0-45-1.

Spread the love