నవతెలంగాణ- అమరావతి : పాఠశాల బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. ఈ ఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలం ఉప్పలపాడు వద్ద చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు స్కూల్ బస్సు డ్రైవర్ ఏడుకొండలు.. మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆ సమయంలో పాఠశాల బస్సు రోడ్డు మధ్యలో ఆగింది. స్థానికులు గమనించి డ్రైవర్‌ను కిందికి దించి పరిశీలించగా అప్పటికే మృతి చెందాడు. అధికారులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సహాయంతో అద్దంకికి చేర్చారు.