
– మొక్కల ఆలనాపాలన కరువు..
నవతెలంగాణ – చివ్వేంల
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిరుపయోగంగా మారాయి. ఉండ్రు గొండ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం నీళ్లు పొసే వారు లేక, మొక్కల ఆలనా పాలనా చూడక పోవడం తో మొక్కలు ఎండిపోతున్నాయి. ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలించడం లేదు. ప్రభుత్వం గ్రామాలకు కొత్త శోభ తీసుకురావడానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని పంచాయతీలకు సూచించింది. దీంతో గ్రామ పంచాయతీలు కొంత భూమిని సేకరించి లక్షకుపైగా నిధులు కేటాయించి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాయి. అయితే గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నడంతో పల్లె ప్రకృతి వనంపై శ్రద్ధ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఉండ్రు గొండ గ్రామంలో స్థలం లేకపోవడంతో గ్రామానికి సమీపంలోని గుట్టలలో ఏర్పాటు చేశారు.నీళ్లు పోసేవారు లేక మొక్కలు ఎండి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉండ్రు గొండ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు పల్లె ప్రకృతి వనంలో ఎండిపోయిన మొక్కలను చూసి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం పంచాయతీ నిధులతోపాటు ఉపాధిహామీ పథకాన్ని వినియోగించుకున్నారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటడానికి కావాల్సిన గుంతలు తీయడానికి, నాటిన మొక్కల నిర్వహణ కోసం ఉపాధిహామీ పథకంలో పనులు చేపట్టారు. నేల చదును చేయడం, అవసరం ఉన్నచోట మట్టి పోయడం, పంచాయతీ నర్సరీలో ఉన్న మొక్కలు కాకుండ ఆహ్లాదం పంచడానికి కావాల్సిన మొక్కల కొనుగోలుకు పంచాయతీల నిధులు కేటాయించారు. ఒక్క పల్లె ప్రకృతి వనం నిర్మాణం కోసం రూపాయలు రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేశారు.
ఆహ్లాదం పంచని వనాలు!
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో ఎక్కడ ఆహ్లాదం పంచడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలను కొన్నిచోట్ల గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంతో పల్లె ప్రకృతి వనాలకు చేరుకోవాలంటే ఆహ్లాదం మాట పక్కన పెడితే ఆయాసం వచ్చే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు. మరికొన్ని జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేశారు. మరి కొన్ని చోట్ల చెరువులు, కొన్ని చోట్ల శ్మశానవాటికల పక్కన పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పల్లె ప్రజలు ఆహ్లాదం కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో గ్రామ ప్రజలు సాయంత్రం వేళలో కాసేపు పల్లె ప్రకృతి వనంలో సేదతీరుదామని అనుకున్నా అక్కడి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ వెళ్లినా అక్కడ ఉండే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని పల్లె ప్రజలకు ఆహ్లాదం అందే విధంగా ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.