మోడీ పాలనంతా గ్యాస్‌..ట్రాష్‌..

Modi regime Gas..Trash..– ప్రజానీకాన్ని భ్రమల్లో ముంచిన బీజేపీ
– ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటవు
– రాష్ట్రంలో కాంగ్రెస్‌ మూల్యం చెల్లించుకోబోతోంది
– 9 స్థానాల్లో ఆ పార్టీకి మూడోస్థానం
– బీజేపీకి వస్తే ఒకటి లేదంటే అది కూడా లేదు
– బీఆర్‌ఎస్‌కు 12 నుంచి 14 సీట్లు..
– కచ్చితంగా కేంద్రంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాం
– ఈసారి ప్రాంతీయ పార్టీలదే హవా : విలేకర్ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
– మోడీ పాలనంతా గ్యాస్‌.. ట్రాష్‌..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదేండ్ల మోడీ పాలనంతా ఒట్టి గ్యాస్‌.. అంతా ట్రాష్‌ అంటూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రజల్ని భ్రమల్లో ముంచటం, ఉన్మాదాన్ని రెచ్చగొట్టటమే బీజేపీ పని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటవని ఆయన మరోసారి చెప్పారు. ఈసారి ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో కీలక భూమికను పోషిస్తాయని తెలిపారు. తమకు రాష్ట్రంలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు రావటం ఖాయమనీ, అప్పుడు కేంద్రంలో క్రియాశీలక పాత్రను పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్నెల్లలో చేసిన తప్పులు, వైఫల్యాలకుగాను కాంగ్రెస్‌ రాష్ట్రంలో భారీ మూల్యం చెల్లించుకోబోతోందని హెచ్చరిం చారు. రేవంత్‌ ఒక అర్భక ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వానికి ఏ విషయంపైనా స్పష్టమైన విధానం లేదని ఎద్దేవా చేశారు. ‘పదేండ్ల బీజేపీ పాలన, అరవై ఏండ్ల కాంగ్రెస్‌ ఏలుబడి, ఆర్నెల్ల రేవంత్‌ సర్కారును చూశాం…అందువల్ల ఆ రెండు జాతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదు.. తెలంగాణకు బీఆర్‌ఎస్సే శ్రీ రామరక్ష.. అందువల్ల మా పార్టీని ఆదరించండి…’ అని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను తూర్పార బడుతూ ఆయన ఈ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించారు. సీఎం రేవంత్‌ వాడుతున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్నెల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కరెంటు కష్టాలు, తాగునీటి గోస, ఎండిన పంట పొలాలు, రైతు బంధు రాకపోవటం, ధాన్యం కొనుగోళ్లు, గొర్రెలు, మేకలు, చేప పిల్లల పంపిణీ నిలిచిపోవటం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, సీఎంఆర్‌ఎఫ్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవటం తదితర సమస్యలను ప్రజలు చవిచూశారని ఆయన ఈ సందర్భంగా వాపోయారు. అందువల్ల రేవంత్‌ సర్కార్‌పై ప్రజలు కోపంగా ఉన్నారనే విషయాన్ని తాను బస్సు యాత్ర సందర్భంగా గుర్తించానని వివరించారు. అత్యంత అమూల్యమైన సమయాన్ని రాజకీయ కక్ష సాధింపు ధోరణులకు, చిల్లర రాజకీయాలకే వాడుకున్నారు తప్పితే ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. ఇదంతా లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపబోతోందని తెలిపారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ సభ జనం లేక వెలవెల బోవటం, సీఎం రేవంత్‌ మీటింగుల్లో సైతం కుర్చీలు ఖాళీగా ఉండటం… ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న కోపానికి నిదర్శనాలని విమర్శించారు. రాష్ట్రం నుంచి పెట్టుబడులు, పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు మోడీ పదేండ్ల ఏలుబడిలో దేశ జీడీపీ 6.8 శాతం నుంచి 5.8 శాతానికి పడిపోయిందని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌… అంటూ బీజేపీ ఊదరగొట్టిందనీ, కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరికీ వికాసం లభించలేదని వాపోయారు. అభివృద్ధి మాటేమోగానీ, దేశంలో నిరుద్యోగం మాత్రం తారాస్థాయిలో పెరిగిందని గుర్తు చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల సంగతి తర్వాత, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయారని విమర్శించారు. అయినా బీజేపీకి 400 సీట్లు వస్తాయంటూ మోడీ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆ పార్టీకి 200 సీట్లు కూడా దాటబోవన్నారు. తెలంగాణలో బీజేపీకి వస్తే ఒక సీటొస్తుంది లేదంటే అది కూడా రాదని చెప్పారు. కాంగ్రెస్‌ 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితం కానుందని వ్యాఖ్యానించారు.
అది మోడీ సృష్టించిన రాజకీయ కుంభకోణం…
ఢిల్లీ లిక్కర్‌ స్కాం అనేది ప్రధాని మోడీ సృష్టించిన ఒక రాజకీయ కుంభకోణమని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దాన్నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తన కుమార్తె కవిత కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారంటూ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తాను బట్టబయలు చేశాననీ, అందుకే మోడీ తనపై కక్షగట్టారని చెప్పారు. ఈ తతంగంలో పాల్గొన్న బీఎల్‌ సంతోశ్‌ (మోడీకి కుడిభుజం, బీజేపీ ప్రధాన కార్యదర్శి)ను అరెస్టు చేయించేందుకు తాను ప్రయత్నించిన కారణంగానే, కవితను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో నాటి సీఎంగా తనకేం సంబంధముంటుందని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌ ప్రళయ గర్జనను చూస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రైతుబంధును ఆపేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రకరకాల కొర్రీలేస్తోందని చెప్పారు. ఏకకాలంలో రుణమాఫీ చేయటం రేవంత్‌ సర్కార్‌ వల్ల కాదని అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. రిజర్వేషన్లను తీసేయటానికి తమ పార్టీ వ్యతిరేకమనీ, అయితే కులం, మతం ఆధారంగా కాకుండా ఆర్థిక పరిస్థితి ఆధారంగా వాటిని నిర్దారించాలని ఆయన సూచించారు.

Spread the love