ఆశావర్కర్లకు నిర్వహించే పరీక్షను రద్దుచేయాలి

–  కనీసవేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలంటూ..
– ఆశా వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ధర్నాలు
   నవతెలంగాణ-విలేకరులు
ఆశా వర్కర్లకు కొత్తగా పరీక్ష పెట్టి అర్హత సాధిస్తేనే వారిని కొనసాగిస్తామని ప్రభుత్వం కొత్తగా నిబంధన పెట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వడంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల నోడల్‌ ఆఫీసర్లు, వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు, మాన్యం చల్క, లైన్‌ వాడ, రాములబండ పీహెచ్సీల ఎదుట ధర్నాలు నిర్వహించారు. మెడికల్‌ ఆఫీసర్లు, ఆశా నోడల్‌ ఆఫీసర్లకు యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేశారు. నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైద్యులు సయ్యద్‌ ఇక్బాల్‌కు వినతిపత్రం ఇచ్చారు. మునుగోడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. దామరచర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అర్బన్‌ హెల్త్‌ సూపరింటెండెంట్‌కు, బొల్లపల్లిలోని పీహెచ్‌సీ వైద్యునికి వినతిపత్రాలు అందజేశారు. భూదాన్‌పోచంపల్లిలోని పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌ యాదగిరికి వినతి పత్రం అందజేశారు.
కొమరం భీమ్‌ జిల్లా కాగజ్‌నగర్‌లోని సీహెచ్‌సీ, నజ్రుల్‌నగర్‌ పీహెచ్‌సీల ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సీతారాం, వైద్యాధికారికి వినతిపత్రం అందించారు. కౌటాలలో పీహెచ్‌సీ ఎదుట ధర్నా చేపట్టారు. ఆసిఫాబాద్‌ మండలంలోని అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సిర్పూర్‌(టి) మండలంలోని లోనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ధర్నా నిర్వహించి వైద్యాధికారి కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ మణి విక్టోరియాకు ఆశా కార్యకర్తలు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని పెద్ద షాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్లు ధర్నా చేశారు. అనంతరం మెడికల్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, అశ్వాపురం, పాల్వంచ మండలాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారులకు వినతి పత్రం అందజేశారు. చర్లలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించని యెడల ఈనెల 12న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించిన ఆశా కార్యకర్తలు.. అనంతరం డాక్టర్‌ మానసికి వినతిపత్రాన్ని అందజేశారు. తాడూరు మండల కేంద్రంలోని పీహెచ్‌ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పడం పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా చేశారు. కొత్తకోట మదనపురంలో ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించి డాక్టర్‌ భవాని రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

Spread the love