జమిలి ఎన్నికలకు జూన్‌లోనే మొదలైన కసరత్తు

The exercise for Jamili elections started in Juneముంబయి : జూన్‌ 2…కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం జరిగిన నాలుగు రోజులకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా కాగా మరొకరు ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా||పి.కె.మిశ్రా.
ప్రస్తుతం బాగా చర్చ జరుగుతున్న అంశమైన ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ పథకానికి కోవింద్‌ ఆధ్వర్యంలో కసరత్తు ప్రారంభించేందుకు ఈ సమావేశం ఉద్దేశించబడిందని ఈ పరిణామం గురించి తెలిసిన వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పరాజయం పాలైన వెంటనే ఈ కసరత్తు ప్రారంభమైంది. నిజానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్టీని బాగా దెబ్బతీశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే సీట్ల గురించి ఆందోళన పెరిగేలా చేశాయి. దాంతో ఒకేసారి ఎన్నికల నిర్వహణ అనే అంశం తెరపైకి వచ్చింది.
అయితే కోవింద్‌ను ఎందుకు ఎంచుకున్నారు?
మాజీ రాష్ట్రపతి అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌ పెద్దగా ప్రజా సంబంధాలు కలిగిన వ్యక్తి కాదు, కానీ జఠిలమైన చట్టసంబంధమైన అంశాలను నిర్వహించ గలిగే సామర్ధ్యం వుంది. మోడీకి ఆయన అంటే గురి, విశ్వాసం వుంది. ”2024 ఎన్నికలకు ముందుగా ప్రతిపక్షాలు సంఘటితం కావడాన్ని దెబ్బ తీయడానికి గానూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు భూమికను సిద్ధం చేయాల్సిందిగా మోడీ విశ్వసనీయులైన తన పార్టీ కార్యకర్తలను కోరారు.” అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
”ఒక దేశం, ఒక ఎన్నిక” కమిటీకి అధినేతగా కోవింద్‌ పేరును శుక్రవారం లాంఛనంగా ప్రకటించారు. ఆ మరుసటి రోజు కమిటీలోని సభ్యులు పేర్లను ప్రకటించారు. ప్యానెల్‌ సన్నాహక కార్యకలాపాల కోసం ఆదివారం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు కోవింద్‌ను కలిశారు. అయితే, మాజీ రాష్ట్రపతి కోవింద్‌ ఈ సన్నాహక కార్యకలాపాలను జూన్‌ 2 నుండే ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
సోషల్‌ మీడియాలో ఆయన టైమ్‌లైన్‌ను ఒక్కసారి చూసినట్లైతే ఇందుకోసం ఆయన అవసరమైన సన్నాహాలను ఎలా చేశారనేది తెలుస్తుంది. గత మూడు మాసాల్లో ఆయన 10మంది గవర్నర్లతో భేటీ అయ్యారు. రిటైరైన రాష్ట్రపతులకు బిజీగా వుండే షెడ్యూల్‌ వుండదు. సాధారణంగా వారు తమ చివరి కాలాన్ని ఆస్వాదిస్తూ గడుపుతారు. లేదా తమ జ్ఞాపకాల దొంతరలను పేరుస్తూ ఒకటి రెండు పుస్తకాలు రచిస్తారు. కానీ, దీనికి విరుద్ధంగా కోవింద్‌ రాజ్‌భవన్‌ల చుట్టూ ప్రయాణించడం ఆరంభించారు. గవర్నర్లను, పార్టీ నేతలను కలుసుకోవడం వారితో చర్చించడం మొదలుపెట్టారు.
జూన్‌ 9 నుండి ఆగస్టు 29 మధ్య కాలంలో, కోవింద్‌ కనీసం 10మంది గవర్నర్లు లేదా అడ్మినిస్ట్రేటర్లతో సమావేశమయ్యారు. వారిలో కొంతమందితో ఒకటి కన్నా ఎక్కువసార్లే భేటీ అయ్యారు. దీనికి తోడు, సీనియర్‌ పార్టీ నేతలను, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతను కూడా కలిసి చర్చలు జరిపారు. ప్యానెల్‌ నియామకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తన ప్రతిపాదనలను పటిష్టం చేసే పనిని కమిటీ ఇప్పటికే ప్రారంభించింది. సెప్టెంబరు 18 నుండి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ కమిటీ నివేదికను ప్రవేశపెట్టనున్నారు.
2025 దరిదాపుల్లో పదవీ కాలాలు ముగుస్తున్న అసెంబ్లీల (మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటివి)ను రద్దు చేయాలన్నది ఈ ముసాయిదా వెనుక గల ఆలోచనగా వుంది. మరోపక్క ఇటీవలే ఎన్నికలు జరుపుకున్న కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ఒక ఏడాది పొడిగించబడుతుంది. తద్వారా వచ్చే సైకిల్‌లో అంటే 2029లో అక్కడ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం వల్ల ప్రతిపక్షాల ఇండియా ఫోరమ్‌ను గందరగోళంలో నెట్టవచ్చని సీనియర్‌ బిజెపి నేత ఒకరు వ్యాఖ్యానించారు. ”పశ్చిమ బెంగాల్‌లో, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకోవడానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీకి, కాంగ్రెస్‌, వామపక్షాలకు కష్టసాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా తమ స్థానిక ప్రయోజనాలను ముందుగా కాపాడుకోవాలని భావిస్తుంది. అలాగే ఢిల్లీ, పంజాబ్‌ల్లో ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య ఇటువంటి సమస్యలే వస్తాయి. కాంగ్రెస్‌తో వున్న ప్రాంతీయ పార్టీలు పరస్పరం ఘర్షణ పడతాయని బిజెపి ఆశిస్తోంది. ఫలితంగా కాషాయ పార్టీకి మరింత వెసులుబాటు దక్కుతుంది.” అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Spread the love