నిరీక్షణ

the expectation– రెన్యూవల్‌ చేసుకోవాలని బ్యాంకులు మాకేం చెప్పలేదన్న రైతులు
– నేటికీ రుణమాఫీ కాకపోవడంపై రైతుల ఆందోళన
– వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట మాఫీ కాని రైతుల నిరసన
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మూడు దఫాలుగా రైతులకు సంబంధించి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పూర్తిగా రుణమాఫీ అయినట్టుగానే ప్రభుత్వం తెలిపింది. అయితే, తమకు రుణమాఫీ కాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తాము అర్హులం అయినా రుణమాపీ కాకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. పలు సొసైటీల్లో, గ్రామాల్లో రుణమాఫీ కాకపోవడంతో రైతుల్లో నిరాశ, నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి ఉన్నాయి. దీనిపై వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట నెక్కొండ మండలం అలంకానిపేట రైతులు ఆందోళనకు దిగారు. దాంతో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు అలంకానిపేట బ్రాంచ్‌ను సందర్శించి రుణమాఫీ కాని రైతుల వివరాలన్నీ తీసుకుని వెళ్లారు. కాగా, రుణమాఫీ కాకపోవడంపై రైతులు, బ్యాంకు అధికారులు, సొసైటీ అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. రైతులు విధిగా బ్యాంకుకు వచ్చి రుణాలను రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుందని, అలా చేసుకోకపోవడం వల్లే రుణమాఫీ కాలేదనిపిస్తుందని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు అలంకానిపేట బ్రాంచ్‌ మేనేజర్‌ శివప్రసాద్‌ అంటున్నారు. ములుగు ఎస్‌బీఐ అధికారులు రుణాలను రెన్యూవల్‌ చేయాలని చెప్పినా, గణపురం సొసైటీ అధికారులు చేయకపోవడం వల్లనే రుణమాఫీ వర్తించలేదని రైతులు అంటున్నారు. పరస్పర ఆరోపణల నేపథ్యంలో గందరగోళం నెలకొంది.
వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు పరిధిలో 1,477 మంది రైతులకుగాను కేవలం 506 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మరో 880 మంది రైతులకు రుణమాఫీ నేటికీ జరగలేదు. 91 మంది అనర్హులున్నారు. దాంతో రైతులు వరంగల్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోనూ ఇదే పరిస్థితి. గణపురం సొసైటీలో 5 వేల మందికి సభ్యత్వం ఉంది. ఇందులో 2,919 మంది రైతులకు రూ.8.85 కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయ నేతల ప్రకటనల నేపథ్యంలో వీరంతా రెన్యూవల్‌ చేసుకోలేదు. 2018 సెప్టెంబర్‌లోపు రుణాలను రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంది. వారు చేసుకోకపోవడంతో రుణమాఫీ వర్తించలేదని అధికారులు అంటున్నారు. ఇవన్నీ మొండి బకాయిలేనని, అందుకే రుణమాఫీ కాలేదని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.
మొండి బకాయిలు : శివప్రసాద్‌, ఐఓబీ, అలంకానిపేట
చాలా ఏండ్లుగా రుణాలను రెన్యూవల్‌ చేసుకోకపోవడం వల్ల వాటిని మొండి బకాయిలుగా భావించాం. అందువల్లనే రుణమాఫీ కాలేదు. రుణాలు తీసుకున్న రైతులు వచ్చి రుణాలను రెన్యూవల్‌ చేసుకోవడానికి సంతకం పెడితేనే రెన్యూవల్‌ అవుతుంది. కానీ రైతులు ఈ విషయంలో ముందుకు రాలేదు.
రెన్యూవల్‌ కాని రుణాల మాఫీపై సర్కార్‌ స్పందించాల్సిందే.. : ఎం. చుక్కయ్య, రైతు సంఘం నాయకులు, హన్మకొండ జిల్లా
రెన్యూవల్‌ కాని రుణాలను మాఫీ చేసే విషయంలో సర్కార్‌ స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రెన్యూవల్‌ కాకపోయినా రుణాలను వెంటనే మాఫీ చేయాలి. సాకులు చూపి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు. వెంటనే సాంకేతికపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు రుణమాఫీ చేయాలి.
రెన్యూవల్‌ చేసుకుంటేనే రుణమాఫీ అని చెప్పలే..
2022లో రూ.78 వేలు రుణం తీసుకున్న.. ఇప్పుడు వడ్డీతో కలుపుకొని రూ.96 వేలు అయింది. 2023లో రెన్యూవల్‌ చేయలే.. ఎన్నికల్లో రుణాలు చెల్లించొద్దు.. రుణాలన్నింటినీ మాఫీ చేస్తమన్నరు.. రెన్యూవల్‌ చేసుకుంటేనే రుణమాఫీ అని చెప్పలేదు. రెన్యూవల్‌ చేయకున్నా రుణాలు మాఫీ అయితయనుకున్నం.
– బొడ్డుపల్లి సురేష్‌, రైతు, పెద్దకోర్పోల్‌

Spread the love