ఖర్చు బారెడు.. చెల్లించేది మూరెడు !

ఖర్చు బారెడు.. చెల్లించేది మూరెడు !–  పెరిగిన ధరలు, పెండింగ్‌ బిల్లులతో ఇక్కట్లు
–  ఇదీ ‘మధ్యాహ్న భోజనం’ ఏజన్సీల దుస్థితి
నవతెలంగాణ-మల్హర్‌రావు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజన్సీ నిర్వాహకులు ఆర్థిక భారం ఎదుర్కొంటున్నారు. పెరిగిన ధరల వల్ల కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేయలేకపోతున్నారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నారు. మరోవైపు కొన్ని నెలలుగా బిల్లులు పెండింగ్‌ ఉండడంతో రోజువారీ భోజ నానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు జయ శంకర్‌-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని మధ్యాహ్న భోజనం ఏజెన్సీల నిర్వాహకులే నిదర్శనం.
మల్హర్‌రావు మండల వ్యాప్తంగా 5 జిల్లా పరిషత్‌, 2 ప్రాథమికోన్నత, 27 ప్రాథమిక, ఒక కస్తూర్భా, ఒక మోడల్‌ స్కూల్‌ మొత్తం 37 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 1,853మంది విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు. కాగా వీరికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంటుంది. పెరిగిన ధరలతో ఏజన్సీ నిర్వహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న ఏజన్సీలు స్లాబ్‌ రేటు పెంచినా అమలులోకి రాలేదు. పెరిగిన ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.20 స్లాబ్‌ రేటు పెంచితే మంచి ఆహారం అందే అవకాశం ఉంది. శనివారం, గురువారం బిర్యానీ, కిచిడి అందించాల్సి ఉండగా ఒక్కో విద్యార్థిపై అదనంగా భారం పడడంతో కొన్ని పాఠశాలల్లో వడ్డించడం లేదు. దీనికి తోడుగా గత ఆరు నెలలుగా ఏజన్సీలకు రావాల్సిన దాదాపు మండల వ్యాప్తంగా రూ.5లక్షల బకాయిలు రావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో నామమాత్రంగా పప్పు,చారుతో భోజనం అందిస్తున్నారు. గుడ్డు కూడా సక్రమంగా అందించడం లేదు.ఇప్పటికైనా అదికారులు స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని, పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ధరల భారం ఇలా… (రోజుకు ఒక్కో విద్యార్థిపై)
తరగతి చెల్లిస్తుంది అవుతున్న ఖర్చు భారం
1-5 రూ.5.45 రూ.16.84 రూ.11.41
6-10 రూ.8.15 రూ.19.44 రూ.11.29
గుడ్లు(3) రూ.15 రూ.21 రూ.6
పప్పులు,కూరగాయలు రూ.40 రూ.150 రూ.110
మంచినూనె, చింతపండు రూ.80 రూ.140 రూ.60
కారం రూ.150 రూ.300 రూ.150
మండల వ్యాప్తంగా మొత్తం విద్యార్థులపై రోజు వారి భారం అదనంగా రూ.2580 పడుతోంది.
పెరిగిన ధరల ప్రకారం ఇవ్వాలి
ఇటీవల పెరిగిన ధరలు వల్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం నిర్వాహకులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వమే పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి.అలాగే పెండింగ్‌ లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలి.
: అక్కల బాపు యాదవ్‌, యువైఏప్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

Spread the love