– ఉక్రెయిన్‌ను హెచ్చరించిన మస్క్
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో రోజురోజుకూ ఉక్రెయిన్ పరిస్థితి బలహీన పడుతుందని, మాస్కోతో చర్చలకు కూర్చునే ముందు కీవ్ ఎంత భూభాగాన్ని కోల్పోతుంది, ఎంత మంది జీవితాలను వథా చేస్తుంది అనేదే ”అసలు ప్రశ్న” అని టెస్లా, స్పేస్‌ఎక్స్ సిఇఓ ఎలోన్ మస్క్ అన్నాడు. గత సంవత్సరం ఉక్రెయిన్ చాలా గొప్పగా చెప్పుకున్న ఎదురుదాడి విఫలమవుతుందని ”ఏ మూర్ఖుడైనా ఊహించగలడు” అని, ”సహజ సరిహద్దులులేని భూభాగాన్ని రక్షించుకోవటం చాలా కష్టం” అని శనివారం తన ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్‌లో మస్క్ పేర్కొన్నారు. ”ఆయుధ పాటవంగానీ, వైమానిక దళ ఆధిక్యతగానీ లేని ఉక్రెయిన్ అత్యంత బలమైన రష్యా సైన్యంపై దాడి చేయడం విషాదకరమైన పరిణామాలకు దారితీసిందని” అని మస్క్ రాశారు.
రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో 4,44,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, వీరిలో గత సంవత్సరం ఎదురుదాడిలో 166,000 కంటే ఎక్కువ మంది చనిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో అంచనా వేసింది. అయినప్పటికీ, ఫిబ్రవరి 24, 2022 నుండి తమ దేశానికి చెందిన 31,000 మంది సైనికులు మాత్రమే మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఫిబ్రవరిలో పేర్కొన్నారు. యుద్ధం మరింత కాలం కొనసాగితే ఉక్రెయిన్ తిరిగి పొందలేనంతగా మరింత భూభాగాన్ని కోల్పోతుందని, చివరకు ఒడెస్సా కూడా పతనమై ఉక్రెయిన్‌కు నల్ల సముద్రం అందుబాటులో లేకుండా పోతుందని, ఇలా జరగకముందే ఉక్రెయిన్ రష్యాతో శాంతి చర్చలు ప్రారంభించటం మంచిదని తన అభిప్రాయంగా మస్క్ రాశారు.
2022 ప్రారంభంలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఎలోన్ మస్క్ ఉక్రెయిన్‌పై తన అభిప్రాయాన్ని అనేక సార్లు మార్చుకున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి స్టార్‌లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్, ఉపగ్రహ ఆధారిత నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను కీవ్‌కు ఆయన ఉచితంగా అందించారు. అయితే నల్ల సముద్రంలోని రష్యా నౌకాదళానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ ఉపయోగిస్తుందనే భయంతో క్రిమియా సమీపంలో ఈ సేవలను సక్రియం చేయడానికి ఆయన నిరాకరించారు. ఒకవేళ ఈ సేవల ప్రభావంతో యుద్ధం తీవ్రతరమైతే అందులో తనూ భాగస్వామిగా మారేవారే. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం గురించి విస్తతంగా మాట్లాడటానికి మస్క్ తన ఎక్స్ ఖాతాను ఉపయోగిస్తున్నారు.
క్రిమియాపై తనకు హక్కు ఉన్నదనే వాదనను ఉక్రెయిన్ విడిచిపెట్టి, తటస్థతను ప్రకటించాలని, నాలుగు ప్రాంతాలను- డొనెట్సక్, లుగాన్సక్, ఖెర్సన్, జాపోరోజీ- రష్యన్ ఫెడరేషన్‌లో చేరడంపై కొత్త రిఫరెండా నిర్వహించడానికి అనుమతించాలని ఆయన ప్రతిపాదించి ఒక సంవత్సరానికి పైగా అవుతోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావటానికి ముందు కీవ్, పాశ్చాత్య దేశాలకు రష్యా చేసిన ప్రతిపాదనతో ఈ ప్రతిపాదన పోలి ఉంది. అయితే మాస్కో మొదట్లో డొనేట్సక్, లుగాన్సక్‌లలో స్వయంప్రతిపత్తి కోసం మాత్రమే డిమాండ్ చేసింది. ఉక్రెయిన్ తో అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మాస్కో నొక్కిచెప్పింది. అయితే ఉక్రేనియన్ నాయకత్వం ”భౌతిక వాస్తవికతను” అంగీకరించడానికి సిద్ధంగా లేదని రష్యా అంటోంది. 2022 నుండి ఉక్రెయిన్ సరిహద్దులు తీవ్రంగా మారిన వాస్తవాన్ని ఉక్రెయిన్ పరిగణనలోకి తీసుకోవాలని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శనివారం అన్నారు.