– ప్లేస్కూళ్ల తరహాలో అంగన్‌వాడీలను మారిస్తే తీవ్రనష్టం
– నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం
– సర్కారు బడుల్లో నాలుగో తరగతిలో విద్యార్థులు చేరుతారా?
– ప్రయివేటు స్కూళ్లలో ప్రవేశాలు పెరిగే అవకాశం
– ప్రభుత్వ నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘాల విమర్శ
– సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రతిపాదనపై సానుకూలత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లేస్కూళ్ల తరహాలో అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతాం. వాటిలో మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా చర్యలు చేపడతాం. ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్‌ను నియమిస్తాం. నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను త్వరలో ఏర్పాటు చేస్తాం.’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం సమీక్షలో చెప్పారు.ప్లే స్కూళ్ల తరహాలో అంగన్‌వాడీలను మార్చడమే కాకుండా మూడో తరగతి వరకు అక్కడే విద్యాబోధన ఉంటుందన్న ముఖ్యమంత్రి ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. ఆ నిర్ణయం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదమున్నది. ఇప్పటికే వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంకోవైపు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ (ప్రీప్రైమరీ) తరగతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ఏటా తగ్గుతున్నాయి. తాజాగా మూడో తరగతి వరకు అంగన్‌వాడీల్లోనే విద్యాబోధన ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశమున్నది. ప్రస్తుత విద్యాసంవత్సరం లో బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 70,116 మంది విద్యార్థులు చేరారు. అంగన్‌వాడీల్లో మూడో తరగతి వరకు బోధన ప్రారంభిస్తే ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో బోధన అందుతున్నది. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం అమలైతే ఆ పాఠశాలలు ఉంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల స్వరూపం ఎలా మారుతుందో చూడాల్సి ఉంటుంది.
అంగన్‌వాడీలకు విద్యాశాఖతో సంబంధం లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) పథకం కింద అంగన్‌వాడీలు పనిచేస్తాయి. అవి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యాశాఖతో సంబంధం ఉండదు. ఈ నేపథ్యంలో మూడో తరగతి విద్యాబోధన ఎలా అమలవుతుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతున్నది. ఇంకోవైపు బోధన కోసం ఉపాధ్యాయులను విద్యాశాఖకు సంబంధం లేని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు ఎలా పంపుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు, బదిలీలు, పదోన్నతులు ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో, ఎలాంటి ప్రతిపాదనలతో మార్గదర్శకాలను విడుదల చేస్తుందో చూడాలి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ-2020) అమల్లో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నట్టుగా పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. 10+2+3గా ఉన్న విద్యావిధానాన్ని 5+3+3+4గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ పాఠశాల పాఠశాలల మూసివేతకే దోహదం : టీఎస్‌యూటీఎఫ్
అంగన్‌వాడీలను ప్లేస్కూళ్లుగా మార్చి మూడో తరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని, దాన్ని విరమించుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంగన్‌వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించటం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి తెలిపారు. మూడో తరగతి వరకు అంగన్‌వాడీలకు అప్పగించటం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకే దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానించదగినదని తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతికి, సబ్జెక్టుకొక టీచరు, ప్రధానోపాధ్యాయులు, తగినంత బోధనేతర సిబ్బంది పాఠశాలలో ఉండేలా చూడాలని సూచించారు.
ప్రభుత్వ విద్యారంగానికి నష్టం : ఎస్‌ఎఫ్‌ఐ
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యాబోధన చేయాలనే ప్రతి పాదన ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలుగుతుందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు తెలిపారు. ఆ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేసే కుట్రలో భాగంగానే ఆ నిర్ణయం చేసిందని విమర్శించారు. ప్రాథమిక తరగతులను అంగన్‌వాడీల్లో నిర్వహించాలనే ఎన్‌ఈపీలో ప్రతిపాదించిన ఆలోచలను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపారు. ఈ నిర్ణయం అమలు చేస్తే పేదప్రజలు, ప్రధానంగా బలహీన వర్గాలు విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఠమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుందని తెలిపారు. అసెంబ్లీలో ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరురు. విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యల గురించి, విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు.
ఆశించిన ఫలితాలుండవు : టీపీఎస్వీ
ప్రీప్రైమరీతోపాటు మూడో తరగతి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యాబోధన చేయడం వల్ల ఆశించిన ఫలితాలుండబోవని తెలంగాణ పౌరస్పందన వేదిక (టీపీఎస్వీ) రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండాలనీ, తరగతికి ఒక టీచర్‌ను మొత్తం ఏడు మంది ఉండాలనీ, ఒక హెడ్మాస్టర్ ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై మేధావులతో చర్చిస్తామంటూ చెప్పడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.
అనాలోచిత నిర్ణయం : టీఎస్‌పీటీఏ
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యాబోధన అమలు చేయాలనేది అనాలోచిత నిర్ణయమని టీఎస్‌పీటీఏ అధ్యక్షులు సయ్యద్ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య తెలిపారు.