నిరుద్యోగ పెనుభూతం!

unemployment Thank you!– యువత ఆశలు ఆవిరి
– విద్యార్హతకు తగిన ఉద్యోగాలే లేవు
– చిరుద్యోగాలతో కాలక్షేపం
– ఇది ప్రధాన సమస్యే
– వ్యవసాయం చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న పీజీలు
దేశంలోని నిరుద్యోగ యువతలో మూడింట రెండు వంతుల మంది విద్యావంతులే. అయినప్పటికీ వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేకుండా పోతోంది. జీవనోపాధి కోసం ఏదో ఒక ఉద్యోగం సంపాదించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. బతుకు బండి లాగడమే  దుర్భరంగా మారింది.
మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా దభాడీ గ్రామానికి చెందిన 42 సంవత్సరాల శివనంద్‌ సావలే దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. తండ్రి చనిపోయినా ఆ బాధను దిగమింగుకొని ఎమ్మెస్సీ, డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. గ్రామంలో బాగా చదువుకున్నది ఆయనే. డిప్లొమా సర్టిఫికెట్‌తో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేయవచ్చు. కానీ ఆయనకు ఉద్యోగం రాలేదు. 13 సంవత్సరాల నుండి ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్నారు. ఇంత అనుభవం ఉన్నప్పటికీ నెలకు కేవలం రూ.7,500 రూపాయల జీతం మాత్రమే వస్తోంది. గ్రామంలో భూమి లేని వ్యవసాయ కార్మికుల సంపాదనతో పోలిస్తే ఇది తక్కువే. ఇది ఒక్క సావలే కథ మాత్రమే కాదు…దేశంలో అనేక మంది చిరుద్యోగులైన విద్యావంతుల కన్నీటి వ్యథ.
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా నిరుద్యోగం ముందుకు వస్తోంది. ఓటర్లు ప్రధానంగా ఈ సమస్యను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని ఎన్నికలకు ముందు లోక్‌నీతి-సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) నిర్వహించిన సర్వేలో తేలింది.
ప్రయివేటు ఉద్యోగాలకు వేలం
ఆరతి మాదిరిగానే దభాడీకి చెందిన చంద్రకాంత్‌ కూడా నిరుద్యోగే. బాటనీలో స్పెషలైజేషన్‌తో సైన్స్‌లో పీజీ చేశారు. ఎడ్యుకేషన్‌లో డిగ్రీ కూడా ఉంది. ఓ పాఠశాలలో ఉద్యోగం కోసం వెళితే డొనేషన్‌ ఇవ్వాలని షరతు పెట్టారు. ఆ స్తోమత లేక మరో పాఠశాలకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు లంచాలు అడగడం ఇక్కడ సర్వసాధారణమేనని స్థానికులు తెలిపారు. ఓ రకంగా చెప్పాలంటే యాజమాన్యాలు ఉద్యోగాలను వేలం వేస్తున్నాయి. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో 21,678 ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రకటన ఇస్తే 1,36,000 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కేవలం 11 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారు.
చిన్నా చితకా పనులు చేసిన చంద్రకాంత్‌ చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసి, పొలంలో పత్తి, సోయాబీన్‌ పంటలు వేశారు. ‘గ్రామంలోని రైతుల్లో బాగా చదువుకున్నది నేనే’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. అయితే ఆ నవ్వు వెనుక ఎంతో విషాదం దాగి ఉంది.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, ఆ హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు, చిరుద్యోగుల కలలు కల్లలయ్యాయి. వారంతా సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి గట్టి గుణపాఠం చెబుతున్నారని వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
అప్పుడు బీజేపీకి… ఇప్పుడు కాంగ్రెస్‌కు
రాలేగావ్‌ పట్టణానికి చెందిన సిధాంత్‌ మండే ఇంజినీరింగ్‌ చదివారు. సరైన ఉద్యోగం లభించకపోవ డంతో ఓ భవన నిర్మాణ స్థలంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు నెలకు లభించే జీతం కేవలం రూ.12,000 మాత్రమే. సంపాదించిన డిగ్రీ తనకు తిండి పెట్టలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకు తగిన ఉపాధి లభిస్తుందన్న ఆశతో 2014 ఎన్నికల్లో ఆయన ప్రధాని మోడీకి, బీజేపీకి మద్దతు ఇచ్చారు. దశాబ్ద కాలంలో దేశంలో 25 కోట్ల ఉద్యో గాలు సృష్టిస్తానంటూ మోడీ ఇచ్చిన హామీని విశ్వసిం చారు. ఆ ఆశలు ఆవిరవడంతో 2019లో కాంగ్రెస్‌కు ఓటేశారు. ఇప్పుడూ అలాగే చేస్తానని చెప్పారు.
నిరుద్యోగుల్లో పెరుగుతున్న విద్యావంతులు
దేశంలో తక్కువ వేతనాలతో జీవితాలను వెళ్లదీస్తున్న సావలే వంటి చిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి విద్యకు ఏ మాత్రం గౌరవం లేకుండా పోతోంది. న్యూఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చిలో దేశంలో నిరుద్యోగ రేటు 7.6శాతంగా ఉంది. దేశంలోని నిరుద్యోగ యువతలో ఎక్కువ మంది కనీసం సెకండరీ విద్యను అభ్యసించిన వారేనని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ (ఐహెచ్‌డీ) నివేదిక తెలిపింది. 2000లో నిరుద్యోగ యువతలో కేవలం 35.2% మంది మాత్రమే విద్యావంతులు కాగా 2022 నాటికి అది 66శాతానికిి పెరిగింది.
పిల్లలకు ట్యూషన్‌ చెబుతూ…
రాలేగావ్‌కే చెందిన ఆరతి కున్‌కన్వర్‌ కూడా చిరుద్యోగే. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే స్తోమత ఆమెకు లేదు. కుటుంబానికి ఏకైక జీవనాధారమైన తండ్రి గత ఏడాది మరణించారు. దీంతో ఆమె సోదరుడు డిగ్రీ చదువుకు స్వస్తి చెప్పి ఓ ఆటోమొబైల్‌ షోరూంలో పనికి వెళుతున్నాడు. అతనికి రూ.10 వేల జీతం వస్తోంది. ఆరతికి మాత్రం ఆ పట్టణంలో ఇప్పటి వరకూ పని దొరకలేదు. ఇప్పుడామె ఇరుగు పొరుగు పిల్లలకు ట్యూషన్‌ చెబుతోంది. ఒక్కో విద్యార్థి నెలకు రూ.200 రూపాయలు ఇస్తాడు.

Spread the love