– ఇంటర్ విద్యా బలోపేతానికి కృషి చేస్తాం : జేఎల్ అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ కమిషనరేటట్ పరిధిలో 1,392 జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు తుది జాబితాను దసరా పండుగలోపు విడుదల చేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో అభ్యర్థులు సమావేశమయ్యారు. అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 15 ఏండ్ల తర్వాత జేఎల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెరిట్ జాబితాను ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలనను సజావుగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మెన్ ఎం మహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. దసరాలోపు 1,392 జేఎల్ పోస్టుల భర్తీకి తుది జాబితాను ప్రకటించి అపాయింట్‌మెంట్ ఆర్డర్లను త్వరగా ఇవ్వాలని కోరారు. విశ్వవిద్యాలయాల్లో జేఆర్‌ఎఫ్, నెట్, సెట్ ఉత్తీర్ణత సాధించి పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతం, నాణ్యమైన విద్యను అందించే అవకాశం లభిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీపీఎస్సీ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని జేఎల్ పోస్టులకు తుది జాబితాను వెంటనే ప్రకటించాలని కోరారు.