తమిళనాడులోని నీలగిరి కొండల్లో పెద్దగా చదువుకోని గిరిజన గ్రామాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కానీ జయశ్రీ ఆ సంప్రదాయాన్ని బద్దులు కొట్టి పైలట్‌గా ఎదిగింది. ఆమె సొంతూరు నీలగిరి జిల్లా కొత్తగిరి సమీపంలోని కురుకుటి. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డిఫెన్స్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు నిత్యం అక్కడి కొండల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.
ఆ ఊరి జనం వాటిని చూసి మురిసిపోతూ ఉంటారు. కానీ వాటిని ఎక్కే అవకాశమే వారికి లేదు. ఆ విమానాలను చూస్తూ పెరిగిన జయశ్రీ ఎప్పటికైనా పైలట్ అవ్వాలని కలలు కనేది. అయితే అందుకోసం ఏం చదువుకోవాలో చెప్పేందుకు ఆ ఊరిలో ఎవరూ లేరు. దాంతో తన కలను కొంత కాలం పక్కన పెట్టేసింది. జయశ్రీ తండ్రి జె. మణి రిటైర్డ్ గ్రామ నిర్వాహకుడు, తల్లి మీనామణి సంగీత విద్వాంసురాలు. తల్లి దగ్గర డ్యాన్స్, సంగీతం నేర్చుకుంది.
ఊహించని మలుపు
పైలెట్ కావాలనే కోరిక బలంగా ఉంది. కానీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల కాబట్టి ఆ చదువుకు ధైర్యం చాలలేదు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేసింది. జీవితంలో నిలదొక్కుకోవడానికి ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. వ్యాపార విశ్లేషకురాలిగా మారింది. సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్‌లో నైపుణ్యం సాధించింది. కానీ కోవిడ్‌తో ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. లాక్‌డౌన్ సమయంలో ఇంటి నుంచి పని ఇవ్వడంతో జయశ్రీ తిరిగి గ్రామానికి వచ్చింది. ఇంటి నుండి పని చేయడం మొదట బాగానే ఉన్నా నాలుగు గోడలకు పరిమితం కావడం ఆమెకు ఇష్టం లేదు. ఆ ఉద్యోగం చేయాలా వద్దా అనే ఆలోచనలో పడింది. మొదట కాస్త బయపడిన ధైర్యంగా ముందుకు నడిచింది. అప్పుడే పైలట్ కావాలనే తన ఆలోచనను తల్లిదండ్రులతో పంచుకుంది.
కఠినమైన శిక్షణను…
కూతురి కోరికను తల్లిదండ్రులు అంగీకరించడమే కాదు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. ఇదే తన తొలి విజయంగా జయశ్రీ భావించింది. ఉద్యోగాన్ని వదులుకుని కూనూర్ సమీపంలోని వెల్లింగ్‌టన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా చేరింది. అక్కడ పనిచేసిన 6 నెలల్లో ఏవియేషన్ గురించి నేర్చుకుంది. తర్వాత దక్షిణాఫ్రికా ఉల్కాన్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో దరఖాస్తు చేసి ఆహ్వానం అందుకుంది. చేస్తున్న ఉద్యోగం మానేసి వేరే ఏదో చేస్తుందని తెలుసుకున్న కొంత మంది బంధువులు ‘ఇంత ఖర్చుపెట్టి అమ్మాయిని విదేశాలకు పంపడం అవసరమా’ అన్నారు. అయినా అవేమీ పట్టించుకోకుండా ఓ అడుగు ముందుకేసింది. జోహన్నెస్‌బర్గ్ విమానాశ్రమంలో కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కూడా పొందింది. బడుగర్ తెగలో ఈ ఘనత సాధించిన తొలి యువతిగా కీర్తి ఘడించింది. ఇటీవలె తన శిక్షణ పూర్తి చేసుకుని జయశ్రీ గ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.
సామాజిక సేవలోనూ…
పైలట్‌గా 70 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. కమర్షియల్ పైలట్ లైసెన్స్ కోసం ఆమె పరీక్ష రాయాలి. అలాగే శిక్షణా కాలంలో 250 గంటల పాటు విమానం నడపాలి. అందుకు తాను సిద్ధమేనని గర్వంగా చెబుతోంది. అయితే బడుగ తెగ నుంచి ఇంతటి గొప్ప విజయం సాధించిన జయశ్రీ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తుం దని చెప్పొచ్చు. ఒకవైపు తన కల నిజం చేసుకు నేందుకు కష్టపడుతూనే మరోవైపు సామాజిక సేవ కూడా చేస్తుంది. ఓ ట్రస్ట్‌లో వాలంటీర్‌గా చేరి తాను నివసించే కొండ గ్రామాలలోని పేద పిల్లలకు చదువు చెబుతోంది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలకు, కళాశాల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు విద్యలో శిక్షణనిస్తుంది. ఐటీ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే ఈ సేవా కార్యక్రమాల కోసం కొంత సమయం వెచ్చించేది. పైలట్‌గా చేరినా తన సేవా కార్యక్రమాలు మాత్రం ఆపను అంటుంది.