అటవీ సంరక్షణ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

– జూన్‌ 30న భూమి అధికార్‌ ఆందోళన దేశవ్యాప్త ఆందోళనకు పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గిరిజనులతోపాటు అడవులు, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న వారి హక్కులను హరించే ప్రతిపాదిత అటవీ పరిరక్షణ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని భూమి అధికార్‌ ఆందోళన (బిఎఎ) డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లును వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ భూమి అధికార్‌ ఆందోళన్‌లో భాగమైన దాదాపు 50 సంఘాలు జూన్‌ 30న దేశవ్యాప్త నిరసనను నిర్వ హించనున్నాయి. దేశంలోని ఖనిజాలు అధికంగా ఉన్న అటవీ ప్రాంతాలను కార్పొరేట్లకు ఇవ్వడమే ఈ బిల్లు లక్ష్యమని పేర్కొంది. మంగళవారం నాడిక్కడ ఎఐకెఎస్‌ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హన్నన్‌ మొల్లా, విజూ కృష్ణన్‌ (ఎఐకెఎస్‌), విక్రమ్‌ సింగ్‌ (ఎఐఎడబ్ల్యుయు), ప్రేమ్‌ సింగ్‌ (కిసాన్‌ మహాసభ), సత్యవాన్‌ (రైతు కార్మిక సంఘం), రోమా మల్లిక్‌ తదితరులు మాట్లాడారు. ”ప్రతిపాదిత బిల్లు అటవీ నిర్వచనాన్నే మార్చేసింది. అటవీ హక్కుల చట్టం, అటవీ రక్షణ చట్టం, పెసా చట్టం, జాతీయ అటవీ విధానానికి విరుద్ధమైన నిబంధనలను ఈ బిల్లు కలిగి ఉంది. రైల్వే ట్రాక్‌లు, పబ్లిక్‌ రోడ్‌లకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దుల నుండి 100 కిలో మీటర్ల పరిధిలోని అడవులు, నియంత్రణ రేఖలకు అటవీ రక్షణ నిబంధనల నుండి మినహాయింపు ఉంది. అదేవిధంగా, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక సంస్థలు, నిర్మాణాల కోసం అడవులను సేకరించవచ్చు” అని నేతలు తెలిపారు. ”అటవీ హక్కుల చట్టం ప్రకారం అడవులపై అధికారం గ్రామసభలకే ఉంటుంది. గ్రామసభల అనుమతితో మాత్రమే అటవీ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలి. కానీ కొత్త బిల్లుతో మైనింగ్‌, ఇతర అవసరాల కోసం కార్పొరేట్లకు అటవీ భూములను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీంతో ఆదివాసీలు తదితరులను పూర్తిగా అడవు లకు దూరం చేయనున్నారు” అని నాయకులు విమర్శించారు.

Spread the love