కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఫ్రెంచ్‌ ప్రభుత్వం

– నెల్లూరు నరసింహారావు
ఫ్రాన్స్‌లోని ఎమ్మాన్యుయల్‌ మక్రాన్‌ ప్రభుత్వం పెన్షన్‌ సంస్కరణ పేరుతో పదవీ విరమణ వయస్సును 62 నుంచి 64 ఏండ్లకు పెంచి, పెన్షన్లలో కోతను విధించింది. లేబర్‌ యూనియన్లు, ప్రతిపక్షపార్టీలు జనవరి 19 నుంచి 13 రోజుల పాటు సాధారణ సమ్మెను నిర్వహించాయి. ఈ పారిశ్రామిక సమ్మెకు మద్దతుగా దేశ వ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు జరిగాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీ ఆమోదం అవసరం లేకుండా చేయగలిగే ఫ్రెంచ్‌ రాజ్యాంగంలోని 49.3 అధికరణను ఉపయోగించి పెన్షన్‌ సంస్కరణను ఆమోదించాడు. ఏప్రిల్‌ 14వ తేదీనాడు ఫ్రెంచ్‌ రాజ్యాంగ పరిషత్తు సంస్కరణ ప్రణాళికను పాక్షికంగా ఆమోదించింది. దాని తరువాత పదవీ విరమణ వయసు పెంపుదలకు సంబంధించిన చట్టంపై ఫ్రెంచ్‌ అధ్యక్షుడు సంతకం చేశాడు.
మేడే రోజున లక్షలాది కార్మికులు తమ పెన్షన్లలో కోత విధించటాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రెంచ్‌ నగరాలలో చేసిన ప్రదర్శనలపై మక్రాన్‌ ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని మోపింది. ప్రదర్శకులపై పోలీసులు జరిపిన హింసలో వేలాదిమంది గాయపడ్డారు. తమను ధిక్కరిస్తే పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు ఎలా విరుచుకుపడతాయో చూపటానికన్నట్టుగా ఆ రోజున ఫ్రాన్స్‌ అంతటా పోలీస్‌ జులుం కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్‌ లో ఏర్పడిన విచీ ప్రభుత్వం తరువాత నిరసన తెలుపుతున్న ప్రజల మీద ఇంతగా హింసను ప్రయోగించిన ప్రభుత్వం మరొకటి లేదు. ఫ్రాన్స్‌లోని 75శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్న ఈ పెన్షన్‌ కోతలను సమర్థించు కోవటానికి ఫ్రెంచ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున హింసను ఆశ్రయిస్తోంది.
ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌ లో సామాజిక అసమానతలపై జరిగిన ”ఎల్లో వెస్ట్‌” ఉద్యమంలో కంటే ఎక్కువగా రాజ్యహింస చెలరేగుతోంది. సంవ త్సరంపాటు జరిగిన ఆ ఉద్యమంలో 10వేల మంది కిపైగా అరెస్టు అయ్యారు. 4400మంది గాయ పడ్డారు. 30మంది వికలాంగులగా మారారు. ఒకరు చనిపోయారు. 2023లో ఫ్రెంచ్‌ ట్రేడ్‌ యూనియన్లు 14 సార్లు జాతీయ స్థాయిలో నిరసన లకు ఇచ్చిన పిలుపుల్లో వేలాది మంది అరెస్టు అయ్యారు. అనేక వందలమంది రబ్బర్‌ బుల్లెట్ల కాల్పుల్లో గాయపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై ప్రభుత్వం పాశవికంగా హింసను ప్రయోగించటాన్ని కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపై కూడా పోలీసులు దాడిచేశారు.
ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస ఉక్రెయిన్‌లో నాటో దళాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తున్నాయని చెబుతున్నది ఎంత అబద్దమో చెబుతున్నది. పెన్షన్లలో కోతలు విధించగా మిగిల్చిన వందలాది కోట్ల యూరోలను సంపన్నులకు పన్నుల రాయితీ ఇవ్వటానికి, అదనంగా 90బిలియన్‌ యూరోలను సైనిక వ్యయం కోసం వెచ్చించటం జరుగుతోంది. ఏఏ వర్గాల ప్రయోజనాలకోసమైతే నాటో సామ్రాజ్య వాద దేశాలు రష్యాతో యుద్ధం చేస్తున్నాయో అవే వర్గ ప్రయోజనాలకోసం అత్యంత సంపన్నమైన సామ్రాజ్యవాద దేశాలలో కూడా హింసాయుత పాలనను సాగిస్తున్నాయి. అయితే మక్రాన్‌ ఎంతగా రాజ్యహింసను ప్రయోగించిన ప్పటికీ ప్రజా ఉద్యమాన్ని నియంత్రించ లేక పోయాడు. పెంచిన హింసతోపాటు ఉద్యమం కూడా బలోపేతమైంది.
ఒకవైపు నాటో దేశాల మద్దతుతో ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుంటే మరోవైపు నాటో దేశాలలో కార్మికుల ఉద్యమాలు ఉవ్వెత్తున్న లేస్తున్నాయి. ఏ ఆర్థిక, భౌగోళిక, సామాజిక వైరుధ్యాలు సామ్రాజ్యవాద పాలక వర్గాలను యుద్ధాలకు పురికొల్పుతున్నాయో అవే వైరుధ్యాలు కార్మికులను పోరాటాలకు కార్యోన్ముఖులను చేస్తు న్నాయి. రాజ్యహింస పెరుగుతున్నాకొద్దీ రాజీలేని పోరాటాల అనివార్యతపట్ల కార్మికులకు అవగాహన పెరుగుతోంది. సాధారణ సమ్మెతో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయటానికి మూడింట రెండు వంతుల ఫ్రెంచ్‌ ప్రజల మద్దతు ఉందని ఈ విషయంపై చేసిన పోల్స్‌ తెలియజేస్తున్నాయి. అయితే ఇందుకు కార్మిక వర్గం తన సకల శక్తులను వినియోగించాలి.
ఫ్రాన్స్‌లో పెల్లుభికిన కార్మిక వర్గ నిరసనలు అంతర్జాతీయంగా పాలక వర్గాలను కలవరపాటు కు గురిచేస్తున్నాయి. పెన్షన్లలో కోతలు విధించటం చట్టంగా మారటంతో చెలరేగిన నిరసనోద్యమం, వేతనాలలో కోతలు, సామాజిక మితవ్యయ చర్యలు, పెరుగుతున్న ద్రవ్యోల్భణం జర్మనీ, బ్రిటన్‌తోసహా ఐరోపాలోని వివిధ దేశాలలో సమ్మెలకు దారి తీస్తున్నాయి. ఫ్రాన్స్‌లో జరుగుతున్న నిరసనో ద్యమం పట్ల వివిధ దేశాలు మే డే రోజున తమ ఆందోళనను వెలిబుచ్చాయి. ఉక్రెయిన్లో రష్యాతో యుద్ధం కొనసాగటానికి తమ దేశాలలో కూడా వేతనాలలో కోతలను, సామాజిక మితవ్యయ చర్యలను విధించినప్పుడు ఫ్రాన్స్‌ లో వలే కార్మికులు నిరసన ఉద్యమాలకు దిగుతారేమోనని ఈ దేశాలు భయపడుతున్నాయి.
1968 మే నెలలో ఫ్రెంచ్‌ సాధారణ సమ్మె జరిగినప్పుడు అది అంతర్జాతీయంగా అనేక విప్ల వోద్యమాలు చెలరేగటానికి దారితీసిందని పెట్టుబడి దారీ దేశాలలోని పాలక వర్గాలకు తెలుసు. ఐరోపా లో బ్రిటన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌, స్పెయిన్‌ దేశాలలో ప్రభుత్వాలు పతనం అయ్యాయి. ఆ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఒక తరం విద్యార్థులను, కార్మికు లను రాడికలైజ్‌ చేసింది. 55సంవత్సరాల తరు వాత, 1991లో సోవియట్‌ పతనం జరిగిన మూడు దశాబ్దాల తరువాత ప్రపంచమంతా వర్గ పోరాటాలు చెలరేగుతున్నాయి. ప్రపంచీకరింప బడిన పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిష్కారంలేని భౌగోళిక రాజకీయ, ఆర్థిక వైరుధ్యాలతో ఒక నూతన నాటో-రష్యా ప్రపంచ యుద్ధంలో కూరుకుపోతున్న పాలక వర్గాలు జనజీవితాలను మెరుగుపరచగల స్థితిలో లేవు. ప్రజలు తిరగబడుతుంటే ఈ పాలక వర్గాలు హింసను ఆశ్రయించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మరింత ప్రజాస్వామ్యం కోసం పోరాడక తప్పని అనివార్యత ప్రజల ముందు ఉంది. అలా జరగకపోతే జనజీవనం భరించలేనంతగా దిగజారుతుంది. ఇటువంటి నూతన వాస్తవంతో ప్రపంచం సంక్షుభితం అయివుంది.

Spread the love