భవిష్యత్తు అంతా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదే..

– నియోజక వర్గానికి ప్రత్యేక గుర్తిపు కోసం నిరంతరం కృషి: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రస్తుతం సమాజంలో ఉన్న శాస్త్రసాంకేతిక పరిస్థితి భవిష్యత్తులో ఉండదని,సమాజం నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటుంది అని అందులో భాగమే నేడు మనం వినియోగించు కుంటున్న ఆధునిక వసతులు,సమాచారం విప్లవం అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. భవిష్యత్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన సంచార ప్రయోగ శాల (ప్లో – ప్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్)ను తన చొరవతో గురువారం స్థానిక వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాల లో అందుబాటులోకి తెచ్చి ప్రదర్శన ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి కంటే ప్రతీ చిన్న విషయం భవిష్యత్తు లో ఇంకా ఎంతో ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో నే అనుసంధానం అయి ఉంటుందనీ నేడు అలాంటి విద్య కే ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్ధులకు సూచించారు. విద్యాపరంగా ప్రతీ అంశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్ధినీ విద్యార్ధులకు అందుబాటులోకి తేవడానికి ఎమ్మెల్యే గా తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గానికి ఈ ఐదు సంవత్సరాలలో ఒక మంచి గుర్తింపు రావాలని అన్నారు. తన నియోజకవర్గం నుంచే ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరడానికి కృషి చేస్తున్నానని ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు ఎంత కష్టమైనా విద్యార్థుల కోసం అందిస్తానని ప్రకటించారు. ప్లో (ప్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ) ఫౌండర్ అండ్ సీఈఓ మధులాష్ బాబు బృందం తాము సొంతంగా క్రియేట్ చేసిన ఇన్నోవేషన్స్ తో విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తు లో ప్రతి మనిషికి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముఖ్యమని,ఇప్పటిలా ముందున్న రోజులు ఉండవని ప్రతి దానికి సైన్స్ మీద ఆధారపడవల్సిందేనని వారి ప్రయోగాల ద్వారా నిరూపించి విద్యార్థులకు చాలా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఆలోచింప జేశారు. ఈ కార్యక్రమంలో చక్కటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే జారే సీఈవో మధులాష్ బాబు టీం ద్వారా బహుమతులు అందించారు.
ఇంత చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం అందించినందుకు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
అనంతరం పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జారే కు చదువుల పట్ల ఉన్న శ్రద్ధను పట్టుదలను ఆయన చేస్తున్న కార్యక్రమాలలో కనిపిస్తుందని వారి కష్టానికి అనుగుణంగా మేము కూడా విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి నిర్వహించిన హైదరాబాద్ “ఫ్లో” టీం సభ్యులను అందరినీ, ప్రత్యేకంగా ఫౌండర్, సీఈఓ మధులాష్ బాబు ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, ఎం.పి.టి.సీ వేముల భారతి, కార్యక్రమం కు ఆతిథ్యం ఇచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు,అశ్వారావుపేట జిల్లా పరిషత్ బాలుర,బాలికల,మైనార్టీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హరిత,వెంకయ్య,సంగీత, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,పలు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love