దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కెరీర్ గైడన్స్ ,ఆరోగ్య సంరక్షణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల వికాసమే ప్రథమ ప్రాధాన్యతగా పని చేస్తానని అన్నారు.చీకటి నుండి వెలుగులోకి రావడం కోసం ,సామాజిక భద్రత హోదా పొందడంలో విద్య ముఖ్య సాధనమని అన్నారు.యంపి నిధుల నుండి ధర్మసాగర్ కళాశాల కోసం నా వంతు సహాయ సహకారాలతో ప్రత్యేక నిధులను కేటాయిస్తానని తెలిపారు.విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తాను స్థాపించిన కడియం ఫౌండేషన్ ద్వారా చేయూత అందిస్తానని తెలిపారు.నిత్య అధ్యయనం,సమాజ గమన గమ్యాలను పరిశీలన విద్యార్థి జీవితంలో భాగమవ్వాలని సూచించారు.సమాజ వనరులతో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో ఎదిగి సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో పని చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ సందర్భంగా లక్ష రూపాయలు విలువ గల నోట్ బుక్స్,హెల్త్ కిట్స్ విద్యార్థులకు పంపిణీ చేసారు.ఫౌండేషన్ ప్రతినిధి,కళాశాల ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా వైద్య రంగాలలో మనకు కడియం శ్రీహరి కడియం కావ్య అండగా ఉంటారనే భరోసాతో విద్యార్థులు ఆకాశమే హద్దుగా ఎదగాలనే కాంక్షతో కృషి చేయాలని కోరారు.భారత రాజకీయాలలో రాజ్యాంగ విలువలను కాపాడే ఆశాకిరణంగా దారి దీపంగా కావ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. అనంతరం అమెరికా ప్రవాస భారతీయ విద్యార్థులు అదిత్రి కార్తీక్ లు విద్యార్థులకు అవగాహన తరగతులను నిర్వహించారు.సమాజానికి తిరిగి చెల్లించు వెలుగులో మాతృ భూమి పై మమకారంతో గ్రామీణ పాఠశాలల కళాశాల విద్యార్థులకు కెరీర్ పరంగా పలు అంశాల పై అవగాహన కల్పించిన అదిత్రి కార్తీక్ లను సత్కరించారు.అనంతరం కడియం కావ్యను కళాశాల బృందం ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సీఐ మహేందర్, యన్ యస్ యస్ అధికారి జ్యోతి ,అధ్యాపకులు కనకయ్య, కరుణాకర్, గణేష్, వెంకట్రాజ్యం, బాబురావు, ఉపాధ్యాయులు తులసి, సరస్వతి లతో పాటు 250 కు పైగా కళాశాల పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.