నాడు గుజరాత్‌ నరమేధం… నేడు మణిపూర్‌ హింసావాదం!

మణిపూర్‌ రెండున్నర నెలలుగా మండుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పరిష్కారానికి మార్గాలు వెతకడం లేదు. వివిధ జాతి సమూహాలకు, ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు కలిగిన రాష్ట్రం నేడు భయానక పరిస్థితుల్లోకి నెట్టబడింది. కారణం తెగల మధ్య ఘర్షణ అయితే ఆజ్యం పోస్తోంది మాత్రం మతం. దీన్ని చోద్యం చూస్తూ కాలయాపన చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. పైగా అక్కడ హింసను ప్రోత్సహి స్తోందనే విమర్శలు అనేకం. అసలు మణిపూర్‌ తగలబడిపోవడానికి కారణమేంటి?
రాష్ట్రంలో అనేక వనరులమీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్నవారు మైతేయిలు. వెనకబడినవారు కుకీలు, నాగాలు. వీరు మెజారిటీగా క్రైస్తవులు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. పల్లపు ప్రాంతాల్లో ఉండే మైతేయిల భూములపై, ఇతర వనరులపై చట్టబద్ద హక్కు కుకీ, నాగ ప్రజలకు లేవు. వీరు నిరంతరం వివక్షకు గురవుతున్నవారే. మైతేయిలు హిందువులు. ఆధిపత్య పాలకవర్గం ఇప్పటివరకు ముఖ్య మంత్రులుగా చేసిన వారిలో అత్యధికులు మైతేయి వర్గీయులే. ప్రస్తుత ముఖ్యమమంత్రి బిరెన్‌ సింగ్‌ కూడా అదే వర్గానికి చెందిన వారు. అంతేకాదు మొత్తం అసెంబ్లీ స్థానాలు 60ఉంటే అందులో 40మంది ఎమ్మెల్యేలు మైతేయిలే ఉన్నారంటే వారి ఆధిపత్యంలో కుకీలు, నాగలు ఎలా నలుగుతున్నారో అర్థంచేసుకోవచ్చు. ఈ తెగల మధ్య రాజుకున్న వివాదం ఈనాటిది కాదు చాలా సుదీర్ఘ చరిత్రనే కలిగి ఉంది. రాజ్యాంగబద్ధంగా పొందాల్సిన ప్రతిఫలాలకంటే ఎక్కువగానే అనుభవించిన మైతేయిలు ఈమధ్య కాలంలో కొత్తగా షెడ్యూల్‌ ట్రైబ్స్‌ హోదా, రిజర్వేషన్స్‌ డిమాండ్‌తో ముందు కొచ్చారు, ఇది ఈ వివాదానికి కేంద్రబిందువు. అనేక సామాజిక-ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్న కుకీలు, నాగలకి ఇది ఆగ్రహానికి దారితీసింది. వీరికి ఉద్దేశపూర్వకంగా సమాన వనరుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం, వారు నివసిస్తున్న ప్రాంతాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా వారి నిరాశకు కారణమైంది. ఈ వివాదం ముదిరి రెండు వందలకు పైగా కుకి, నాగ ప్రజల ప్రాణాలు తీసుకునే స్థాయికి హింస ప్రేరేపించబడింది. వీరిలో కనిపించ కుండా పోయినవారి లెక్క కూడా ఎక్కువే అని అంతర్జాతీయ మీడియా సంస్థలు అంచనా వేశాయి. మణిపూర్‌ చరిత్రలోనే ఇది అతిపెద్ద మారణాహోమం.
మణిపూర్‌ సమస్య అంతర్గతంగా ఉన్న జాతుల సమస్య అంటే సరిపోదు. దీనికి అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా తన సరిహద్దులను నాగాలాండ్‌, అస్సాం, మిజోరాం వంటి పొరుగు రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఇవి భూమి, వనరులు, సరిహద్దులపై నిత్యం వివాదాలను ఎదుర్కొంటోంది. అంతేకాకుండా ఇది మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దులో ఉంది. మైతేయిలోని ఒక బలమైన రాజకీయ వర్గం డ్రగ్స్‌ అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేస్తూ కుకి, నాగ ప్రజలపై నెట్టి వారిపై దాడులు చేయడం, ఇండ్లను తగలబెట్టడం, జీవనవిధానాన్ని విధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ విధ్వంసంలో అదే వర్గానికి చెందిన పోలీస్‌ వ్యవస్థ శాంతి భద్రతల నిర్వహణలో ఉంటూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వీరు తెర వెనక ఉండి నడిపించటంతో అక్కడ హింస సజీవంగా కొనసాగుతోంది. పైన చెప్పినట్టుగా వీరి మధ్య ఉన్నది రిజర్వేషన్స్‌, భూ సమస్యలే కాదు, ఇరు వర్గాల మతాలు, హిందూ, క్రిస్టియన్స్‌ కావడం కూడా ఒకటి, ఇంతటి హింసాయుత పరిస్థితులకు ప్రధానమైన పాత్రను పోషించింది మతమే. వారి మధ్య ఉన్న అంతర్గత వివాదాలకు తెరలేపింది. వ్యవస్థ చేస్తున్న నేరాల్లో ఈ దేశంలో బాధితులు సగానికి పైగానే ఉన్నారు. వాజ్‌పేరు, పీవీ నరసింహారావు పాలనలో వీటికి బీజం పడింది. దశాబ్దానికి చేరువవుతున్న బీజేపీ రాజకీయ పాలనలో ఇది మరింత పెరిగింది. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస అనేది ప్రవృత్తిగా మారింది. వారి స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి స్థాయికైనా దిగజారతారనేది 2002 గుజరాత్‌ అల్లర్లతోనే బోధపడింది. ఇప్పుడు మణిపూర్‌ హింసతో నిరూపితమైంది.
మణిపూర్‌లో ఇంతటి హింస జరుగుతున్నా మోడీ ఎందుకు నోరు మెదపడటం లేదన్న ప్రశ్న పాతదే కావచ్చు కానీ సందర్భం కొత్తది. అయినప్పటికీ గత చరిత్రని చెప్పకతప్పదు. 2002లో గుజరాత్‌లో జరిగిన నరమేధం దాదాపుగా రెండువేల మంది ముస్లింల ఊచకోత కారణమైన ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ అంతటి ఘోరమైన హత్యకాండ జరిగినప్పుడు మౌనంగా ఉన్నాడే తప్ప ఖండించలేదు. ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మారణ హోమాన్ని సమర్థిస్తూ మాట్లాడారు కూడా. అ ఘటన తర్వాత ముస్లిలను అనేక చిత్రహింసలకు గురిచేసిన సంఫ్‌ు పరివార్‌ నాయకులను కోర్టు, సిట్‌, సిబిఐ లాంటి వాటి శిక్షల నుండి తప్పించటానికి అయన చేసిన సాహసం చాలా గొప్పది! కాబట్టి మణిపూర్‌ ఇంతటి విషాదఛాయల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న ప్రజలకు మనోదైర్యం ఇచ్చిన దాఖలాలు ఉండవు. అక్కడి హింసని ఆపటానికి మోడీ ప్రయత్నిస్తారనుకోవడం కూడా పొరపాటే.
రాజనీతి శాస్త్రవేత్త పాల్‌ అర్‌ బ్రాస్‌ ”భారతీయ అల్లర్ల వ్యవస్థ సంస్థాగతమైన అల్లర్ల వ్యవస్థ” అని అంటారు. ఆరోగ్యవంతమైన సమాజం హింసను ప్రోత్సహించదు, హింస ఏ రకంగాను సమర్థనీయం కాదు. మణిపూర్‌లో జరిగే హింస యావత్తు వ్యవస్థను కలచివేస్తున్నది ఎన్నికలకు ముందు బీజేపీ కొన్ని హింసాపూరిత ఎత్తుగడ్డలను అవలంభిస్తోంది. మత రాజకీయాలను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గద్దెనెక్కడానికి దేశభక్తి ముసుగులో మత ఘర్షణలని సృష్టించడం, దానితో వచ్చే సానుభూతితో ఎన్నికల్లో లబ్ది పొందాలని చూడటం ఒక అనవాయితీగా అలవర్చుకుంది. మణిపూర్‌లో చాలాకాలంగా రాజకీయ అస్థిరత నెలకొంది. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం కూడా అనేక సమస్యలను తెచ్చిపెట్టింది. అక్కడి ప్రభుత్వాలలో తరచుగా మార్పులు, అవినీతి, బలహీనమైన పాలనా వ్యవస్థ, అంతర్గత సమస్యలు శాపంగా మారాయి. దేశం నుండి ప్రత్యేక గుర్తింపు, స్వయంప్రతిపత్తి లేదా వేర్పాటు కోసం నిరంతరం పోరాడుతున్న అనేక తిరుగుబాటు సమూహాల ఉనికిని మణిపూర్‌ చూసింది. ఈ సాయుధ సమూహాలు తమ రాజకీయ లక్ష్యాలను సాధించుకోవడానికి తరచుగా హింసను ప్రేరేపిస్తునాయి, ఇది భద్రతా దళాలతో ఘర్షణలకు, అంతర్గత సమూహ వివాదాలకు దారి తీస్తున్నాయి.
ఇద్దరు కూకి తెగకు చెందిన మహిళలను నగంగా ఊరేగించి దారుణంగా హత్యచేసిన తీరు యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా కలవరపరిచింది. ఈ ఉన్మాదచర్య బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేదనే సంకేతాన్ని అందించింది. ఇంతటి దారుణాలు జరుగుతున్నా డబుల్‌ఇంజన్‌ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదు. దీన్నిబట్టి చూస్తే హింసను ప్రోత్సహిస్తున్నది, ప్రేరేపించి చోద్యం చూస్తున్నది హిందూత్వ పార్టీ అని ఇట్టే తెలిసిపోతోంది. కానీ ఈ విచ్చిన్నానికి, నరమేధానికి కారణమైన పాలకవర్గం ఎంతోకాలం నిలవదని తెలుసుకోలేకపోవడం కాషాయనేతల అవివేకానికి నిదర్శనం. ఈశాన్య రాష్ట్రాల సమస్యలు సంక్లిష్టమైనవి. అందులో మణిపూర్‌ సమస్య చాలా సున్నితమైనది. తెగల మధ్య ఘర్షణతో ప్రజా జీవనం నేడు పూర్తిగా అస్తవ్యస్తమైంది. హింసకు సంబంధించిన మూలకారణాలను వెతికి వాటి పరిష్కరించడానికి ఇరు వర్గాలతో చర్చలు జరపాలి. హింసాయుత ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యత తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక అభివృద్ధి, మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల సమగ్ర విధానాన్ని ప్రకటించాలి. సర్వం కోల్పోయి ఏ ఆధారం లేకుండా మిగిలిన కూకి, నాగ ప్రజల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిచ్చి చేయూతనివ్వాలి. అప్పుడే రాష్ట్రంలో పరిస్థితి కొంతైనా మెరుగుపడే అవకాశముంది.

సునీల్‌ నీరడి
9493021021

Spread the love