జర్మన్‌ చాన్సలర్‌ ”యుద్ధ పిపాసి”!

బెర్లిన్‌ : జర్మన్‌ చాన్సలర్‌, ఒలాఫ్‌ స్కోల్జ్‌ కు తన పార్టీ మద్దతుదారులతోనే చేదు అనుభవం ఎదురైంది. ‘యూరోపియన్‌ ఫెస్టివల్‌’ పేరుతో తన నాయకత్వంలోని సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(ఎస్పీడీ) బెర్లిన్‌ కు సమీపంలోగల బ్రాండెన్బర్గ్‌ రాష్ట్రంలోని ఫాల్కెన్సీ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కోల్జ్‌ కు నిరసన సెగ తగిలింది.రుప్ట్‌ లై విడియో ఏజన్సీ విడుదల చేసిన విడియోలో ఆహూతులు స్కోల్జ్‌ ని ‘ప్రజాద్రోహి’, ‘యుద్ధపిపాసి’ అని విమర్శించటం కనిపించింది. జర్మన్‌ చాన్సలర్‌ కు చాలా తక్కువమంది మద్దతుదారులు స్వాగతం పలికారు. సభికులలోని ఒక సమూహం ‘ఆయుధాలు లేని శాంతి’ కావాలని నినదిస్తూ స్కోల్జ్‌ ని ‘అబద్దాలకోరు’, ‘దొంగ’ అని గొంతెత్తి అరుస్తూ ‘వెళ్ళిపో’ అని నినదించటం కనిపించింది. ఒకవైపు నిరసన సెగ తగులుతున్నా స్కోల్జ్‌ తన ప్రభుత్వ విధానాలను సమర్థించుకుంటూ ఉక్రెయిన్‌ పైన సైనిక దాడికి పురికొల్పిన రష్యన్‌ అధ్యక్షుడు, వ్లాడీమీర్‌ పుతినే ‘యుద్ధపిపాసి’అని ఆయన అన్నాడు. విమర్శించాల్సింది రష్యన్‌ అధ్యక్షుడినేగానీ తనను కాదని ఆయన అన్నారు. అయితే మే నెలలో ‘యుగవ్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ జర్మన్లు ఉక్రెయిన్‌, రష్యాల మధ్య శాంతి చర్చలు జరగాలని కోరారు. సర్వేలో స్పందించిన వాళ్ళలో 54శాతం మంది నాటోలో ఉక్రెయిన్‌ సభ్యత్వాన్ని వ్యతిరేకించారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో జర్మనీ పెద్ద ఎత్తున సైనికంగా ఉక్రెయిన్‌ కు మద్దతు ఇవ్వటం జర్మన్లకు ఇష్టంలేదు. ఫిబ్రవరి నెలలో జరిగిన సర్వేలో ఉక్రెయిన్‌ కు యుద్ధ విమానాలను సరఫరా చేయటాన్ని మూడింట రెండు వంతుల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 2022 డిసెంబర్‌ లో ‘యుగవ్‌’ నిర్వహించిన సర్వేలో జర్మనీ లియోపర్డ్‌ 2 ట్యాంకులను సరఫరా చేయటాన్ని 45శాతం ప్రజలు వ్యతిరేకించారు. అంతేకాకుండా అనేకమంది జర్మన్‌ ప్రముఖులు చాన్సలర్‌ స్కోల్జ్‌ కు రెండు బహిరంగ లేఖలను పంపారు. ఉక్రెయిన్‌ కు ఆయుధాల సరఫరా చేయటంమాని కాల్పుల విరమణకు, శాంతి చర్చలు జరపటానికి జర్మనీ ప్రయత్నించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Spread the love