– గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతాం : ఎన్‌ఎమ్‌డీసీ మారథాన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ క్రీడల్ని నిర్వహించే స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్‌ను రూపొందిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. దీనికోసం గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పించి, స్థానిక యువతకు క్రీడలపట్ల ఆసక్తి కలిగించేలా ప్రణాళికలు రూపొందిస్తా మన్నారు. ఎన్‌ఎమ్‌డీసీ ఆధ్వర్యంలో జరిగిన హైదరాబాద్ మారథాన్-2024 బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారంనాడిక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. దీనికి ఆయన ముఖ్యఅతిధిగా హజరై, విజేతలకు బహూమతులు అందించి, మాట్లాడారు. క్రీడల్లో ఆదర్శంగా నిలవాల్సిన హైదారాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని విమర్శించారు. ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడి స్టేడియాలను తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రికి చెప్పామన్నారు. 2000 సంవత్సరంలో ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌ను నిర్వహించుకున్నామనీ, ఆ తర్వాత ఆస్థాయి క్రీడలు తెలంగాణలో జరగలేదని చెప్పారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు సిరాజ్‌కు ప్రభుత్వం తరఫున గ్రూప్-1 పోస్టు ఇచ్చామనీ, నిఖత్‌జరీన్‌కు గ్రూప్-1 పోస్టుతో పాటు రూ.2 కోట్లు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ యువతను క్రీడలవైపు మళ్లిస్తూ, పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గచ్చిబౌలిని స్పోర్ట్స్ విలేజ్‌గా తీర్చిదిద్దుతామనీ, ఒలంపిక్స్ నిర్వహణ, పతాకాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్ధాయి కోచ్‌లను తెచ్చి, క్రీడాకారులకు శిక్షణ ఇస్తామన్నారు. దీనికోసం పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వచ్చిందనీ, వారి భాగస్వామ్యంతోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, శాట్ చైర్మెన్ శివసేనారెడ్డి, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.