– లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లగచర్ల వాసుల పట్ల ప్రభుత్వ తీరు అమానుషంగా ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శిం చారు. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం, ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వారిని పోలీసులతో బెదిరించడం దారుణమని పేర్కొన్నారు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం తీరును ఖండించారు. ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపేయాలని డిమాండ్ చేశారు. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని కోరారు.