నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఆశాలకు కనీస వేతనం రూ.18,000 ల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ( సీఐటీయూ ) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశాలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా దాసరి పాండు, కల్లూరి మల్లేశం హాజరై, మాట్లాడుతూ ఆశాలకు నేటికీ ఫిక్స్డ్ వేతనం లేదని వెంటనే ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించాలని, గత సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులపాటు ఆశలు సమ్మె చేశారని ఆ సమ్మె కాలపు వేతనం కూడా నేటికి ఇవ్వలేదని సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలకు పని భారం పెరుగుతుందని, తగ్గించాలని ప్రమాద బీమా సౌకర్యం, ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు . అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కసగొని లలిత జిల్లా ఉపాధ్యక్షురాలు రంగ సంతోష జిల్లా కోశాధికారి పుష్ప బోనగిరి పిహెచ్సి అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి నాయకులు జమున ,కల్పన, పావని, సుజాత హైమావతి,ధనమ్మ లు పాల్గొన్నారు.