నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి

నేతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలి– ఆర్డర్లు ఇచ్చి ఉపాధి కల్పించాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్‌
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించి నేతన్నలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద వస్త్ర పరిశ్రమ అనుబంధ రంగాల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లలో కొన్ని నెలల నుంచి ఉపాధి లేక నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వేలాది కుటుంబాలు ఆధారపడిన వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై అసెంబ్లీలో చర్చించనున్నట్టు చెప్పారు. వస్త్ర పరిశ్రమ జేఏసీ అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్మికులకు గతంలో ఉన్న పథకాలను కొనసాగించాలని, విద్యుత్‌ సబ్సిడీ అందించి ఉపాధి కల్పించాల న్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆధునికతవైపు నడిపించి, బతికించాలన్నారు. పెండింగ్‌ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, పట్టణ కార్యదర్శి పంతం రవి, కడారి రాములు, సీపీఐ(ఎం) నాయకులు రమేష్‌, గణేష్‌ పలువురు వస్త్ర పరిశ్రమ జేఏసీ తాట ిపాముల దామోదర్‌, మండల సత్యం, ఎనుగుల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love