నవతెలంగాణ- హైదరాబాద్: టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి రాజీనామా అంశంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జనార్దన్ రెడ్డి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అందులో నిజం లేదని రాజ్ భవన్ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనార్దన్ రెడ్డి కలిశారు. అనంతరం టీఎస్ పీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్‌కు రిజైన్ లెటర్ పంపించగా గవర్నర్ ఆమోదముద్రవేశారని ప్రచారం జరిగింది. ఇదే విషయం ఇవాళ పలు దినపత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన రాజ్ భవన్ వర్గాలు జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని వెల్లడించాయి. ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పుదుచ్చేరిలో ఉన్నారని, జనార్దన్ రెడ్డి రాజీనామా గవర్నర్ పరిశీలనలోనే ఉందని స్పష్టం చేశాయి.