– న్యాయసలహా నేపథ్యంలో కొంత ఆలస్యం : జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారనీ, కేటీఆర్ అరెస్టుపై గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా న్యాయసలహా తీసుకోవాల్సి ఉంటుందనీ, ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజమని అన్నారు. అంతమాత్రానికే తొందర పాటు వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని చెప్పడం ఆయన అవివేకమని అన్నారు. అవినీతి ఎక్కడ జరిగినా, ఏ పార్టీ చేసినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు. మరి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్నట్టు కదా? అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారనేది అర్థమవు తుందని చెప్పారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలను, కాంగ్రెస్ పాలనాపరమైన అసమర్ధత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయని విమర్శించారు. కేంద్రమంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? అనే విషయంలో కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడే పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభానికి స్వయంగా ప్రధాని మోడీ వచ్చినా అప్పటి సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ దాటి రాలేదని విమర్శించారు. తాము బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పక్షం కాదనీ, ప్రజాపక్షమని చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడిని ఖండించారు. ఆ ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలే తప్ప అమాయక గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సీఎం తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై అక్కడి ప్రజలతో మాట్లాడాలి తప్ప రాజకీయం చేయడం తగదన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పారు.