కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట

ఊరిసామెతలు
– అన్నవరం దేవేందర్‌, 9440763479
కొందరు ఒక పని మీద ధ్యాసతో వుంటే మరికొందరు వచ్చి మాటలతో చెడగొడతరు. వాళ్ళను ‘కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట’ అంటరు. గాడిద హాయిగా గడ్డి మేస్తుంటే బయటి నుంచి ఓండ్ర పెట్టుకుంట మరో గాడిద వచ్చిందట. మేసే గాడిద దానిని చూసి అక్కడ ఏదో ఉన్నదని బయటకు వెళ్ళడం అన్నట్టు. ‘చెడగొట్టు వానలు’ కురిసినట్టు, చెడగొట్టే మనుషులు కూడా వుంటరు. చెడగొట్టు వానలు అంటే వరిపైర్లు కోసి కుప్ప పెట్టినంక ఎండాకాలంల వానలు వచ్చి రైతు ధాన్యం తుడుపుతాయి. వాటిని చెడగొట్టు వానలు అంటరు. పూర్వం ఇంకో సామెత కూడా వుండేది. ‘ఆడది తిరిగి చెడిపోతది, మొగోడు తిరుగక చెడిపోతడు’ అని అంటరు. మగ, ఆడ సమానత్వమే గాని ఆనాటి విలువల నుండి పుట్టిన సామెత. దీనిని ఇప్పుడు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఎవరైనా బయట ప్రపంచంలో తిరిగితేనే లోకజ్ఞానం పెరుగుతది. లేదంటే ‘బాయిల కప్ప లెక్కనే జీవితం’ వుంటది.
మరికొందరికి ‘తినబుద్ది అయితది కాని అడుగ సిగ్గు అయితది’ టైపు కన్పిస్తరు. ఎక్కడికన్నా పోతే అదీ ఇదీ తినాలనిపిస్తది. కని అడుగుతే ఏమనుకుంరోననే మీమాంసలో వుంటరు. నోట్లె లాలాజలం ఊరుతది, మిట్ట మిట్ట సూస్తరు కని ముభావంగ వుంటరు. మరికొందరిలోనైతే పుల్లెగండుతనం ఎక్కువ కనిపిస్తది. వాల్ల గురించే ‘పుల్లెగండు కడుపుకు పిల్లలు దక్కరు’ అనే సామెత పుట్టింది. అంటే పిల్లలు పుట్టినంక పసి పిల్లలకు ఆహారం పెట్టడంలో కాలం గడుస్తది. కానీ పుల్లెగండు వాల్లకు తినేందుకు తమకే చాలదు అనే కారణం వుంటది. కొన్ని ఊర్లర్ల బంధువులు నాలుగైదు ఇండ్లడ్ల వుంటరు. అమ్మమ్మ, చిన్నమ్మ, మేనమామ ఇండ్లు వుంటయి. అందరూ దగ్గరివాల్లే. ఎక్కడికి పోదామా అనుకుంటం. ఆ చుట్టాలు కూడా మా… ఇంటికి రారు కావచ్చు, అక్కడనే తింటరు కావచ్చు అనుంకుంటరు. అప్పుడు ‘అంతా మనవాల్లే అన్నానికి రమ్మనే వాల్లే లేరు’ అన్న సామెత పుట్టింది అందరి పొత్తుల సుట్టం వస్తే అందరూ మా ఇంట్ల తినడు కావచ్చు అని ఆయన కడుపు ఎండగొడుతరు.

Spread the love