మహోన్నత వ్యక్తి పెన్నా అనంతరామ శర్మ

– వారి ఆశయాలు, ఆదర్శాలు యువతరానికి మార్గదర్శకం
– కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్‌ లేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– దొడ్డి కొమరయ్య భవనంలో శర్మ భౌతికకాయానికి నివాళులు
– స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
– పాల్గొన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం
నవతెలంగాణ-నల్లగొండటౌన్‌/కట్టంగూర్‌

సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు పెన్నా అనంతరామ శర్మ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అనంతరామ శర్మ బుధవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. అంత్యక్రియలు గురువారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన కట్టంగూర్‌ మండలంలోని పిట్టంపల్లిలో ముగిశాయి. అంతకుముందు ఉదయం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం అనంతరామశర్మ భౌతికకాయాన్ని ఉంచారు. తమ్మినేనితోపాటు రాష్ట్ర నేతలు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లా డుతూ.. కమ్యూనిస్టులు లేకపోతే దేశానికి భవిష్యత్‌ లేదన్నారు. అనంతరామశర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించారని కొనియాడారు. నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన శర్మ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి శర్మ అని అన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు యువతరానికి మార్గదర్శకం అని చెప్పారు. అనంతరామ శర్మ మరణం కమ్యూనిస్టు పార్టీలకు ముఖ్యంగా సీపీఐ(ఎం)కి తీవ్ర నష్టమని చెప్పారు.
కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. పెన్నా అనంతరామ శర్మ ప్రజా సంఘాల్లో బాధ్యతలు నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులకు చివరికి మిగిలేది ఎర్రజెండా మాత్రమే అని అన్నారు. చనిపోయాక కూడా ఎర్రజెండా కప్పుకోవడమే నిజమైన కమ్యూనిస్టు అని తెలిపారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. అనంతరామ శర్మ నిస్వార్థ ఉద్యమకారుడని, ప్రజా ఉద్యమంలో తనతో కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. వయసులో తేడా ఉన్నా ఉద్యమంలో కలిసి పని చేశామని తెలిపారు. అసంఘటిత రంగాన్ని సంఘటితం చేయడంలో అనంతరామ శర్మ కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మీ మాట్లాడుతూ.. పెన్నా అనంతరామశర్మ మరణం ప్రజాతంత్ర ఉద్యమానికి, పార్టీకి తీరనిలోటని అన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ.. అనంతరామశర్మ సీపీఐ(ఎం)లో సీఐటీయూ యూనియన్‌కు సలహాదారునిగా వ్యవహరించి ఎన్నో కార్మికుల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. శర్మ చిన్న వయసు నుంచే ఎర్రజెండా పట్టి తుద వరకు ఎన్నో ప్రజాపోరా టాలు చేశారన్నారు. పోరాటాల్లో ఆటుపోటులు, ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకు సాగారని తెలిపారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సూర్యా పేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు మల్లు నాగార్జున రెడ్డి, ఎండీ.జహంగీర్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.

సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కమిటీ సంతాపం
తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా సీపీఐ(ఎం) నాయకులు, కార్మికోద్యమ నాయకులు పెన్నా అనంతరామ శర్మ మృతికి సీపీఐ (ఎం) ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ తీవ్ర సంతాపం ప్రకటంచింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఈ మేరకు ఒక సంతాప సందేశాన్ని పంపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించడమే కాక ఆ తర్వాత పార్టీ విచ్ఛిన్నాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలబడ్డ నాయకుడు అనంతరామ శర్మ అని ఆయన కొనియాడారు. చివరి శ్వాస వరకు నిలబడి ఉద్యమాన్ని కాపాడి, దాని అభివద్ధికి అహరహం కషిచేసిన అనంతరామశర్మ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఆయనకు సీపీఐ(ఎం) ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని శ్రీనివాసరావు తన సందేశంలో పేర్కొన్నారు.

పోరాట యోధునికి ఘనంగా తుది వీడ్కోలు
సీపీఐ(ఎం) శ్రేణులు, పెద్దఎత్తున తరలివచ్చి పోరాట యోధునికి ఘనంగా తుది వీడ్కోలు పలికారు. అనంతరామ శర్మ స్వగ్రామం కట్టంగూరు మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. అనంతరామశర్మ కుమారులు పెన్నా రవికాంత్‌ శర్మ, పెన్నా యాదగిరి శర్మ, సరేశ్‌ శర్మ, కుమార్తె సీతమ్మ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌ రెడ్డి, ఎండీ జహంగీర్‌, మల్లు నాగార్జున రెడ్డి, నాయకులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బొజ్జ చిన్న వెంకులు, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండంపల్లి సత్తయ్య, నాంపల్లి చంద్రమౌళి, ప్రభావతి, పెంజర్ల సైదులు, ఇటుకల సురేందర్‌, చిలుముల హేమంతయ్య, ఎన్నా నర్సిరెడ్డి, సయ్యద్‌ హాశం, కారింగు మల్లేష్‌, జాలాంజనేయులు, గోలి స్వామి, గుండమల్ల బిక్షం, కటికం సత్తయ్య గౌడ్‌, మాజీ ఎంపీపీ కొండా లింగస్వామి, మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, పాటల వెంకట్‌ రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మెన్‌ చేగోని సాయిలు, పల్నాటి నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Spread the love