ముగిసిన హ్యాండ్‌బాల్‌ వివాదం

హెచ్‌ఏఐ ప్రధాన కార్యదర్శిగా జగన్‌ 
ఒలింపిక్‌ సంఘం నుంచి గుర్తింపు
హైదరాబాద్‌ : జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్యపై సుదీర్ఘంగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. వ్యక్తుల స్వార్థపూరిత ఆలోచనకు ఆట, క్రీడాకారులకు అన్యాయం జరుగకూడదనే బృహత్తర ఉద్దేశ్యంతో భారత హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ (హెచ్‌ఎఫ్‌ఐ), భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) చేతులు కలిపాయి. అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్యల గుర్తింపు పొందిన హెచ్‌ఐఏ అధ్యక్షుడిగా దిగ్విజరు చౌతాల, ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావు ఎన్నికయ్యారు. రెండు హ్యాండ్‌బాల్‌ సంఘాలు ఏకతాటిపైకి రావటాన్ని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) అధ్యక్షురాలు పి.టి ఉష, సీఈవో కళ్యాణ్‌ చౌబే స్వాగతించారు. హ్యాండ్‌బాల్‌ అభివృద్ది అజెండాతో రాజీ కుదుర్చుకున్న జగన్‌, దిగ్విజన్‌లను అభినందించారు. దేశంలో హ్యాండ్‌బాల్‌ అభివృద్ధి కోసం పని చేసేందుకు ముందుకు సాగుదామని తెలిపారు.
ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఈ ఏడాది జాతీయ క్రీడల్లోనూ హ్యాండ్‌బాల్‌ను చేర్చనున్నట్టు హెచ్‌ఏఐ నూతన ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌ రావు తెలిపారు. జూన్‌లో ఆరంభం కానున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) షెడ్యూల్‌ ప్రకారమే సాగుతుందని, ఈ లీగ్‌తో దేశంలో హ్యాండ్‌బాల్‌కు ఆదరణ రెట్టింపు కానుందని జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌ఏఐ అనుబంధ రాష్ట్ర సంఘాలకు మాత్రమే అధికారిక గుర్తింపు కొనసాగుతుందని, భారత ఒలింపిక్‌ సంఘం సహకారంతో రానున్న రోజుల్లో హ్యాండ్‌బాల్‌కు మరింత జోష్‌ రానుందని అన్నారు.

Spread the love