గుండె చప్పుడు ఆపలేం..

Heart beat can't stop..– గర్భవిచ్ఛిత్తికి సుప్రీం నో
న్యూఢిల్లీ: తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఒక మహిళ చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. గర్భం దాల్చిన కారణంగా సదరు మహిళ ప్రాణాలకు తక్షణ ప్రమాదం లేదని, గర్భంలోని పిండం ఆరోగ్యంగా ఉందని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ తుది నిర్ణయానికి వచ్చింది. ప్రసవానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే తగిన సమయంలో చెల్లిస్తుందని కోర్టు తెలిపింది. తల్లిదండ్రులు కోరుకుంటే పుట్టే బిడ్డను దత్తత ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ (ఎంటిపి) చట్ట ప్రకారం వివాహిత స్త్రీలు, ప్రత్యేక కేటగిరి కిందకు వచ్చే అత్యాచార బాధితులు, వికలాంగులు, మైనర్లు, అనార్యోగం, శారీరక బలహీన మహిళలు తమ గర్భాన్ని విచ్చిత్తి చేసుకోవడానికి గరిష్ట కాల వ్యవధి 24 వారాలుగా ఉంది. ప్రస్తుత కేసులో 26 వారాలకు పైగా వయసు ఉన్న పిండాన్ని తొలగించడానికి మహిళను అనుమతించాలా వద్దా అనే విషయంలో సుప్రీంకోర్టు గందరగోళానికి గురయింది. ముందుగా ఈ పిటీషన్‌ విచారించి ఎయిమ్స్‌ వైద్యులు ఈ నెల 6న ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నెల 9న గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ నెల 10న ఎయిమ్స్‌ వైద్యుల్లో ఒకరు పిండం బతికే అవకాశం ఉందని సుప్రీంకోర్టుకు ఈమెయిల్‌ చేశారు. గర్భవిచ్ఛిత్తికి వ్యతిరేకంగా కేంద్రం కూడా పిటీషన్‌ వేసింది. దీనిపై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయంతో తీర్పు ఇచ్చింది. తుది తీర్పు కోసం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందుకు ఈ పిటీషన్‌ వచ్చింది. గర్భవిచ్ఛితికి అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు ఇచ్చింది.

Spread the love