హీరో..షిమా..!

హీరో..షిమా..!యురేనియం పొట్టనిండా తినేసిన
లిటిల్‌ బారుని పొమ్మని
మేఘాల్లోంచి తోసేశారు.. యుద్ధగాళ్లు!
వాడు ఆగమేఘాలమీద పడిపోతున్నాడు
కొద్ది క్షణాల్లో జరగబోయేది తెలీక…
కింద, పిల్లలు కేరింతలు కొడుతున్నారు
డాక్టర్లు వైద్యం చేస్తున్నారు
నిరుద్యోగులు భవిష్యత్తు కలగంటున్నారు
ఉదయం వేళ అమ్మలు కమ్మని
వంట చేస్తున్నారు…
అంతే! దిగ్మండలం బద్దలైంది!!
పిల్లల నవ్వులు భస్మీపటలమయ్యాయి
ప్రాణాలు పోయినా నిరుద్యోగుల
కళ్లల్లో ఆశలు అలాగే ఉండిపోయాయి
ప్రాణదాతలే ఊపిరొదిలేశారు
అమ్మలు ప్రాణం లేని బొమ్మలయ్యారు
హిరోషిమా కాలుతున్న చితై చింతిస్తుంటే…
అనుకున్నన్ని శవాలు రాలేదంటూ
లెక్కలేస్తున్నారు..
విమానాల్లో యుద్ధగాళ్లు!!
యుద్ధంలో విజయం ఉండదు విరామం తప్ప
జపాన్‌ని ఓడించినా
అమెరికా నైతికత ఓడిపోయింది!
అంతా కోల్పోయినా బూడిదలోంచి ఫీనిక్స్‌లా
హిరోషిమా పునరుజ్జీవించింది…
యుద్ధం ఏ సమస్యనీ పరిష్కరించిన దాఖల్లేవ్‌!
అది మిగిల్చిన సమస్యలు కోకొల్లలు
ప్రపంచ శాంతి వర్ధిల్లాలి!!
(హిరోషిమాపై అణుదాడికి నిరసనగా)
-భీమవరపు పురుషోత్తమ్‌
సెల్‌ :9949800253

Spread the love