హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు

హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు– ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇందిరా కాంగ్రెస్‌ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ కాంగ్రెస్‌ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నదని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి సీఎం పదవి దినదినగండంగా మారిందనీ, ఆయన చెప్పిన వ్యక్తికి పీసీసీ పదవి రాలేదని చెప్పారు. హైకోర్టు తీర్పు విషయంలో పొన్నం వ్యాఖ్యలను చూస్తుంటే సీఎంకు, మంత్రులకు మధ్య చాలా గ్యాప్‌ ఉందని అర్థమవుతున్నదన్నారు. బీజేపీ వేసిన ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించడం శుభపరిణామం అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మారితే వారి ఇండ్ల ముందు చావుడప్పులు కొట్టాలని పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు అనైతికంగా వేరే పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హత వేటు వేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏఐసీసీ నిర్ణయానికి విరుద్ధంగా ఆర్‌ఆర్‌ కాంగ్రెస్‌ నడుచుకుంటున్నదని విమర్శించారు. ఇతర పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేను పీఏసీ చైర్మెన్‌గా నియమించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతలు ట్యాక్స్‌ల వసూళ్లపర్వంలో మునిగిపోయారని ఆరోపించారు. రుణమాఫీ ఎందుకు పూర్తిస్థాయిలో చేయడం లేదని ప్రశ్నించారు. హైడ్రా ఆరంభ శూరత్వమేనని విమర్శించారు.

Spread the love