నవతెలంగాణ – ఒడిశా: అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఓ మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. దీనిపై మృతురాలి భర్త అభి అమానత్య మాట్లాడుతూ… ‘‘మూడు నెలల క్రితం నా భార్య కరుణ (28) ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీ పురుణగూడలోని తన పుట్టింట్లో ఉంటోంది. కరుణ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతిచెందింది. అంత్యక్రియలు నా ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్ పంచాయతీ ఫుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.