నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రేమించి పెండ్లి చేసుకున్న వ్యక్తే కాలయముడై భార్యను కిరాతకంగా హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. ఆకివీడు 14వ వార్డులో నివసిస్తున్న మారడుగుల వీరవెంకట సత్యనారాయణ పెద్ద కుమార్తె సాయిలక్ష్మి కమల సంధ్య (సంధ్యారాణి) అదే ప్రాంతానికి చెందిన వాడపల్లి రాంబాబును ప్రేమించి మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వారికి 18 నెలల బాబు ఉన్నాడు. రాంబాబు గొలుసు చోరీ కేసులో జైలుకు వెళ్లడంతో సంధ్యారాణి(24) కుమారుడితో సహా పుట్టింటికి వచ్చేసి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన రాంబాబు భార్యతో గొడవపడి బిడ్డను తనకు ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె శనివారం ఉదయం తండ్రితో కలిసి స్థానిక భీమేశ్వరస్వామి ఆలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా భర్త రాంబాబు అడ్డుకొని నడిరోడ్డుపైనే చాకుతో విచక్షణా రహితంగా పొడిచాడు. సమీపాన ఉన్న ఆమె తండ్రి ఈ ఘటనను చూసి దగ్గరకు వచ్చేసరికి రాంబాబు పారిపోయాడు. తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు యత్నించగా అప్పటికే మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. రాంబాబు ఆకివీడు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు తెలియడంతో మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మృతదేహాన్ని అక్కడికి తరలించి ఆందోళనకు దిగారు. ఆర్డీవో దాసిరాజు, డీఎస్పీ శ్రీనాథ్లు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.