”పిల్లలు దేవుడూ చల్లనివారే.. కల్లకపటమెరుగని కరుణామయులే.. తప్పులు మన్నించుటే దేవుని సుగుణం.. ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం.. పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును… ఆ పురిటికందు మనసులో దైవముండును.. వయసు పెరిగి ఆశ పెరిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయ మగునులే వెలుగుతున్న సూర్యున్ని మబ్బు మూయును మనిషి తెలివి అనే సూర్యున్ని కోపం మూయును.” అన్నారు ఆరుద్ర.
పిల్లలు దైవానికి ప్రతిరూపాలు, దివ్యత్వానికి ప్రతినిధులు, కల్మషం, కర్కషం, కపటం, అసూయ, ద్వేషాలు ఎరుగని అమలినమైన ప్రవర్తన వారి సొంతం. అలాంటి పిల్లలకు తల్లిదండ్రులుగా, కుటుంబం నుంచి ఎలాంటి మార్గదర్శకత్వం, సమాజపరంగా లేదా పాఠశాలపరంగా ఎటువంటి మంత్రణం పిల్లలకు మనం అందిస్తున్నామనే దానిపైనే వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. పిల్లలకు న్యూటన్ ”చర్యా ప్రతిచర్య” సిద్ధాంతంలాగా చర్యలపరంగా ఎలాంటి శిక్షణ అందిస్తామో ప్రతి చర్యగా అలాంటి ఉత్తమమైన ప్రవర్తనను వారి నుంచి మనం ఆశించవచ్చు.
ఇటివలే సంధ్య ధియేటర్ వద్ద పుష్ప-2 సినిమా బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిసలాటలో (03-12-2024 బుధవారం) రేవతి అనే (35) మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ (9) కింద పడిపోయి జనం కాళ్ళ మధ్య నలిగిపోయారు. ఈ ఘటనలో తల్లి వెంటనే చనిపోగా కుమారుడు శ్రీతేజ ప్రస్తుతం హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ దుర్ఘటన జరిగి మూడు వారాలు గడిచినప్పటికి నేటికి బాబు ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడం ఆందోళన కల్గించే అంశమే. ఈ సంఘటనకు కారకులెవరు? ఎవర్ని తప్పు పట్టాలి? ఆ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ షో చూడటానికి రావటమా? లేదా థియేటర్ యాజమాన్యానిదా? లేదా =ుజ క్రాస్ రోడ్స్ లాంటి జన సమ్మర్ధం వున్న ప్రాంతంలో అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటను అదుపు చేయలేని పోలీసులదా! అన్న అనేక ప్రశ్నలు ఘటన జరిగిన తర్వాత రావడం సహజం కాని ఈ ఘటనకు అభం శుభం తెలియని పసి పిల్లాడు తల్లిదండ్రులను ఎందుకు సినిమా చూడాలని ప్రేరేపించాడు? దానికి తల్లిదండ్రుల తప్పు లేదా? అంటే వుంది అని చెప్పాలి.
పిల్లవాడు ఆ కాలనీలో ”పుష్ప” లాగా మ్యానరిజంతో తిరుగుతుంటే ఆ కాలనీ వారు గాని ఇంట్లో తల్లిదండ్రులు గాని సున్నితంగా అలాంటి ప్రవర్తనను మందలించి వుంటే నేడు ఈ సంఘటన కారకుడై ఉండక పోవచ్చు. అంతెందుకు ఆ సినిమా చూడడానికి అల్లు అర్జున్ వస్తాడని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. దీనికి అతడు కూడా కారకుడే అతడు థియేటర్‌కు రాకుండా వుండి వుంటే ఈ దుర్ఘటన జరిగి వుండేదే కాదు. దీనికి అతడిని (అల్లు అర్జున్) కూడా బాధ్యుడిగానే పరిగణించాలి. అంతెందుకు పోలీసులు అక్కడి రద్దీని నియంత్రించటం కష్టం అని అల్లు అర్జన్ షో చూడటానికి రావద్దని చెప్పినప్పటికీ ఆ విషయం థియేటర్ యాజమాన్యం వారు అల్లు అర్జున్‌కు చెప్పకపోవడం వల్ల కూడా ఈ దుర్ఘటన జరిగింది, అంటే దీనికి సంధ్య థియేటర్ యాజమాన్యం వారు కూడా బాధ్యులే.
పిల్లల్లో అసాధారణమైన, అసహజమైన లేదా వ్యక్తి ఆరాధన (నవతీశీ ఔశీతీరష్ట్రఱజూ) చిన్న వయస్సులోనైనా, టీనేజ్‌లోనైనా కలిగే అవకాశం వుంటుంది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లలను మందలించే ప్రయత్నం చేయాలి. అటువంటి చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దానిపై ఉన్న శ్రద్ధను కెరీర్ పైన, చదువులపైన పెట్టాలని నిజమైన హీరోలు దేశానికి సేవ చేస్తున్నవారు, లేదా బురద మట్టిలో కూరుకుపోయి ఆరుగాలం శ్రమిస్తున్న రైతులు, కార్మికులు లేదా ఎలాంటి వ్యాపార దక్పథం లేని వ్యాపారస్తులు, దేశ సేవచేసే నాయకులను హీరోలుగా పరిగణించాలని తల్లిదండ్రులు సూచించాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీడియా గగ్గోలుపెట్టి భూతద్దంలో పెట్టి దేశవ్యాప్తంగా సంచలనం సష్టించటం కన్నా ఈ అంశంలో పిల్లలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న విషయాలపై మానసిక నిపుణుల సలహాలు, సూచనలు ఎక్కువ మొత్తంలో ప్రసారం చేయాలి. విపరీతమైన డ్రెస్ సెన్సు, హేర్ కటింగ్ వంటి వాటి ప్రభావం, తల్లిదండ్రులు విలువైన వాహనాలు పిల్లలకు ఇచ్చి బయటకి పంపిస్తే ఏం జరుగుతుందో నిత్యం మనం రోడ్డు ప్రమాదాల్లో యువత ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
అంతెందుకు ఇటీవలే చైనా కంపెనీ వీవో (VIVO)మనదేశంలో ”స్మార్ట్ ఫోన్” వినియోగంపై ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ప్రకారం ”స్మార్ట్ ఫోన్” ఎక్కువగా వాడటం వల్ల తల్లిదండ్రుల పిల్లల సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని రోజులో సగటున పెద్దలు ఐదు గంటలుపైగా, పిల్లలు నాలుగు గంటలకు పైగా మించి ”స్మార్ట్ ఫోన్లు” వాడుతున్నారని తెలిపింది.
ఇందులో ఎక్కువ భాగం సామాజిక మాధ్యమాల్లో (Facebook, Whatsapp, Youtube, Instagram, Twitter) వినోద కార్యక్రమాలు వీక్షిస్తున్నట్టు తెలిపింది. దీని ద్వారా యుక్త వయస్సు పిల్లలు, చిన్న పిల్లలు ఇతర దురలవాట్లకు గురయ్యే ప్రమాదం వుందని కూడా సూచించింది. సంబంధాలు దెబ్బతినడానికి ”స్మార్ట్ ఫోన్” కూడా ప్రధాన కారణం అని 73 శాతం మంది తల్లిదండ్రులు, 69 శాతం మంది పిల్లలు ఈ సర్వేలో అంగీకరించటం విశేషం. అలాగే ”స్మార్ట్ ఫోన్” లేకుండా మేం ఉండలేం అని 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు ఈ సర్వేలో ఒప్పుకొన్నారంటే దేశంలో ”స్మార్ట్ ఫోన్” వినియోగం వల్ల మానవ సంబంధాల విధ్వంసం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చును. స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ఇటీవలే ఆస్ట్రేలియా దేశం 16 ఏండ్ల లోపు పిల్లలకు నిషేదించింది. మన దేశం కూడా మున్ముందు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగానే మేల్కొని పిల్లలకు, పెద్దలకు హాని కల్గించే స్మార్ట్ ఫోన్లను, వాటిలో వచ్చే అశ్లీలమైన వీడియోలు ఏవైనా ఉంటే నిలిపి వేసేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక చిన్న యంత్రం కుటుంబ బంధాల్లో చిచ్చుపెట్టి విడిపోవడానికి కారణం అవుతుందంటే మనం దీనిని ఏ స్థాయిలో ”దుర్వినియోగం” చేసున్నామో అర్ధం చేసుకోవచ్చు.
మనిషి జీవితంలో అత్యంత విలువైనది బాల్యమే. అలాంటి బాల్యాన్ని ”రంగులమయం” చేసుకొని అంతకన్నా విలువైన ”యవ్వనాన్ని” ఆ కాలంలో అకాడమిక్ విషయాలపై దష్టిపెడితే పిల్లలు సుందరమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు. అందుకే తమ సంతానం వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు ఎలా అయితే తీర్చిదిద్దుతారో వారికీ అలాంటి భవిష్యత్ మున్ముందు దొరుకుతుంది. సంస్కారం, శిక్షణలతోనే మనిషి వ్యక్తిత్వం రూపు దిద్దుకుంటుంది. కాబట్టి అలాంటి ఉత్తమ శిక్షణ పిల్లకు ఇచ్చి ఉత్తమ విలువలు గల పౌరులుగా తయారు చేయాలన్న బాధ్యత తల్లిదంద్రులదే లేనిపక్షంలో ఓ సంధ్య థియేటర్ సంఘటన కావొచ్చు, మరొకటి కూడా భవిష్యత్తులో జరుగోచ్చు. సంస్కారం, విలువలు అనేవి మెడికల్ షాప్‌లో దొరికే ”డ్రగ్” లాంటిది కాదు అలా దొరికితే అందరు అప్పటికప్పుడు కొనుక్కొని ఆస్వాదించేవారే. కాని ఆ తర్వాత కలిగే అనర్ధాలు ఏమిటి అని ఆలోచించాలి. ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో ఎవరి మధ్య ఏవిధంగా జీవిస్తున్నాడనేది ఆ వ్యక్తి ప్రవర్తించే ”మూర్తిమత్వాన్ని” బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఆ వ్యక్తిపై కుటుంబం, పరిసరాలు, ఇతర సామజిక అంశాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పిల్లల సాంఘీక ప్రవర్తనలో తగిన ప్రభావం లేదా ఫలితం శిశువు లేదా వ్యక్తి ఇరుగుపొరుగుతో మెలిగే తీరు, వారి ఆప్యాయత వారిని సమాజ సభ్యులు ఆదరించే తీరుపై ఆధారపడి ఉంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారిని సక్రమంగా, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడానికి కుటుంబం, పరిసరాలు కూడా సహకరించాలి. అలాగే పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే సరిగానే ఎదుగుతారు పెరట్లో ”గంజాయి” మొక్కను నాటి ”రోజా” పుష్పాలు ఆశిస్తే అత్యాశే అవుతుంది.
డా. మహ్మద్ హసన్, 9908059234
అసిస్టెంట్ ప్రొఫెసర్