– నిరాదరణే కారణమన్న అధ్యయనం
న్యూఢిల్లీ: దళిత సమాజం నుండి వచ్చి వ్యాపారాలు నిర్వహించుకునే వారి ఆదాయం ఇతర వ్యాపారస్తుల ఆదాయంతో పోలిస్తే 16 శాతం తక్కువగా ఉంటోంది. అట్టడుగు వర్గాలకు చెందిన ఇతర వ్యక్తుల వ్యాపారాలు కూడా ఇదే విధంగా తక్కువ ఆదాయంతో నడుస్తున్నాయి. జనాభాలో వేర్వేరు వర్గాల వ్యాపారులు పొందుతున్న ఆదాయాలపై నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలియజేసింది. దళిత సమాజం ఎదుర్కొంటున్న నిరాదరణ కారణంగానే ఆదాయాల్లో వ్యత్యాసం కన్పిస్తోందని పరిశోధకులు వివరించారు. సమాజంలోని అన్ని వర్గాలతో దళిత వ్యాపారులు మంచి సంబంధాలు కొనసాగిస్తున్న ప్పటికీ వారి ఆదాయాలు పెరగడానికి అవి ఉపయోగపడడం లేదు. అయితే ఇవే సంబంధాలు ఓబీసీలు, ఎస్టీలు, ముస్లింు వంటి ఇతర అట్టడుగు వర్గాల వ్యాపారులకు మాత్రం ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి.
సమాజంలోని అన్ని వర్గాలతో సత్సంబంధాలు కొనసాగిస్తే ఎవరి వ్యాపారాలైనా వృద్ధి చెందుతాయన్న భావనలో వాస్తవం లేదని తమ అధ్యయనం స్పష్టం చేసిందని దానికి నేృత్వం వహించిన బెంగళూరు ఐఐఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీక్ రాజ్ చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యంగా, అనూహ్యంగా, అసాధారణంగా ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా ఈ అధ్యయనం ప్లాస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైంది. దళిత వ్యాపారులు, ఇతర వ్యాపారుల మధ్య ఆదాయ వ్యత్యాసం 15-18 శాతం మధ్య ఉన్నదని, దీనికి ప్రధానంగా కులమే కారణమని ప్రతీక్ రాజ్ తెలిపారు. 2021లో జనగణన చేయకపోవడంతో పాటు కులగణనను కూడా తాజా పరలేదని, ఈ నేపథ్యంలో దేశంలోని 140 కోట్ల జనాభాలో దళితుల సంఖ్య 25-30 కోట్లు ఉండవచ్చునని తాము అంచనా వేశామని ప్రతీక్ చెప్పారు. దళితులు అవమానాలను ఎదుర్కోవడం, నిరాదరణకు గురికావడం వల్లనే ఆదాయాల్లో వ్యత్యాసాలు కన్పిస్తున్నాయని అధ్యయన బృందం సభ్యుడు ప్రొఫెసర్ హరి బాప్‌బుజి తెలిపారు. ప్రజలతో సత్సబంధాలు కలిగి ఉండడం అట్టడుగు వర్గాలపై ఒకేలా ప్రభావం చూపడం లేదని అధ్యయనం గుర్తించింది.