రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మృతి చెందాడు. స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్సై టీ.యయాతి రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం,చింతంపల్లి కి చెందిన గొర్రెల కాపరి నాగ నరసింహారావు (46) కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామానికి గొర్రెల మేపేందుకు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాల్లో మేపుతుంటాడు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు తన స్వగ్రామానికి వెళ్లేందుకు శుక్రవారం కాలినడకన బసెల్టర్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఏలూరు జిల్లా వేలేరుపాడు వైపు నుంచి సాయిల సుబ్బారావు కారు అదుపుతప్పి నరసింహారావును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని విజయవాడ ఆస్పత్రికు తరలించి వైద్యం చేయిస్తున్నారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే శనివారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య విజయ తో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటన పై మృతుడి భార్య చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.