భార్యా భర్తలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల ప్రమేయం అవసరమా లేదా? ఒక వేళ ఉన్నా ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అలా కాదు అని ప్రతి విషయంలో కలగజేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో సమస్యలు మరింత ఎక్కువవుతాయి. వాళ్ళు కూడా తమ విషయాలు మరొకరితో చెప్పుకునే ముందు వారికి ఎంత వరకు చెప్పాలో అంతే చెప్పాలి. అది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి పంచుకోవాలి. అలా కాకుండా అన్ని విషయాలు ఇతరులకు చెప్పుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఉదాహరణే ఈ వారం ఐద్వా అదాలత్...
లతకు ఆకాష్‌తో పెండ్లి జరిగి పదేండ్లు అవుతుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ పదేండ్లలో భార్యా భర్తల మధ్య బంధం ఎలాగుంది అంటే బాగానే ఉందని చెప్పలేము, అలాగని బాగోలేదని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్లు సంతోషంగా ఉంటే ఇక్కడి వరకు వచ్చే వారు కాదు కదా! ఆకాశ్ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని భార్యతో కాకుండా ఇతరులతో చెబుతుంటాడు. లతతో తనకు ఎలాంటి సమస్య వచ్చినా వాటి గురించి కూడా వేరే వాళ్లకు చెబుతుంటాడు. ఆ విషయాలన్నీ వాళ్లు వచ్చి లతకు చెబుతారు. వాళ్లు వచ్చి చెప్పే వరకు ఆకాష్‌కు ఏం కావాలో లతకు తెలిసేది కాదు. ఆ మూడో వ్యక్తి కుటుంబంలో ఒకరు అయితే పెద్దగా ఇబ్బందులు ఏమీ వుండేవి కావు. కానీ అలా కాకుండా అతను స్నేహితులతో మాట్లాడడం, వాళ్లు వచ్చి ‘మీరు ఆకాష్‌ను సరిగ్గా చూసుకోవడం లేదు. పెండ్లి జరిగి పదేండ్లు అయినా ఇంకా మేము వచ్చి ఈ విషయాలు చెప్పడం ఏం బాగోలేదు. కానీ మాట్లాడక తప్పడం లేదు. మీలో మార్పు వస్తుందని ఆకాష్‌తోపాటు మేము కూడా ఎదురు చూస్తున్నాము. కానీ మీలో ఎలాంటి మార్పూ లేదు. పైగా మీ వల్ల ఆకాష్ రోజురోజుకు కుంగిపోతున్నాడు. అతనికి ఇక మీతో కలిసి ఉండటం ఇష్టం లేదు. విడిపోవాలని అనుకుంటున్నాడు. వారం పది రోజుల్లో నోటీసులు పంపిస్తా డంటా. అందుకే మేము ఈలోపు మీతో మాట్లాడాలని వచ్చాము. భార్యాభర్తలు విడిపోతుంటే భరించలేక మేము మీతో ఈ విషయాలన్నీ చెబుతున్నాం’ అని చెప్పారు.
‘అసలు సమస్య ఏంటీ? ఎందుకు అతను నా నుండి విడిపోవాలని అనుకుంటున్నారు’ అనే విషయం నాకు తెలియాలి కదా! ఆకాష్ ఇంటికి వచ్చిన తర్వాత లత అడిగితే నోరు తెరిచి సమాధానం చెప్పడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ఆమె ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము విషయం తెలుసుకుందామని ఆకాష్‌కు ఫోన్ చేసి పిలిపిస్తే అతను చెప్పింది ఏంటంటే… ‘లతకు ఒక్క పని కూడా సరిగ్గా రాదు. వంట చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ విషయం మా అమ్మకు, అక్కకు చెబితే మెల్లిగా నేర్చుకుంటుందిలే అంటారు. అంతే కానీ ఆమెను గట్టిగా అస్సలు అడగరు. అమ్మ చాలా సార్లు లతకు ఇంటి పనిలో, వంట పనిలో సాయం చేస్తుంది. నేర్పించడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాస్త పర్వాలేదు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోదు. అందుకే ఒక పనమ్మాయిని పెట్టుకున్నాము. ఇక ఆమెకు వుండేది ఒక్క వంట పని మాత్రమే. అది కూడా సరిగ్గా చేయదు. ఆఫీస్ నుండి 7 గంటలకు ఇంటికి వస్తుంది. రాగానే పని మొదలుపెట్టదు. కొద్ది సేపు కూర్చొని టీ తాగి పిల్లల హౌం వర్క్‌లో సాయం చేసి మెల్లిగా అప్పుడు వంట చేస్తుంది. పిల్లలు తిని 9 గంటలకు పడుకుంటారు. పిల్లలను ఎనిమిది గంటల కల్లా పడుకోబెట్టమని నేను ఎన్నో సార్లు చెప్పాను. అయినా నా మాట వింటే కదా! ఈ విషయాలే నా స్నేహితులతో పంచుకుంటాను. ఇద్దరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళదామంటే రాదు. ఆఫీసుకు సెలవు, పిల్లలకు సెలవు ఉన్న రోజుల్లోనే వెళదామంటుంది. ఈ విషయమే అక్కతో చెప్పాను. ఆమె వచ్చి చెప్పినా వినదు. ఇంటి కోడలు ఇంటి ఆడపడుచు చెప్పిన మాట వినాలి కదా! అయినా మా అక్క నాకు కాకుండా ఆమెకే సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఏ ఒక్కరూ నాకు సపోర్టు చేయరు. అమ్మా, అక్కా చివరకు పిల్లలు కూడా ఆమెకే సపోర్ట్. అందుకే నేను నా బాధలు నా స్నేహితులకు చెప్పుకుంటాను. లత మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఆమెక విడాకులిచ్చి నేను చెప్పినట్టు వినే ఆమెను పెండ్లి చేసుకుందామనుకుంటున్నాను’ అన్నాడు.
దానికి లత ‘ఆకాష్ నాతో అస్సలు ఏమీ మాట్లాడడు. మా అత్తయ్యనే ఇంట్లో వంట చేయడం గురించి, ఏదైనా పని గురించి నాతో మాట్లాడుతుంది. ఆకాష్ మాత్రం నాకు అది నచ్చలేదు, ఇదైతేనే ఇష్టం అని నాతో ఎప్పుడూ చెప్పలేదు. బయటకు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ముందు నాకు చెబితే కదా ఆఫీస్‌లో లీవ్ తీసుకోడానికి. కానీ నాకు ముందు చెప్పడు. అలాంటప్పుడు నాకు సెలవులు ఎలా ఇస్తారు. ఇలా నాతో ఏమీ చెప్పకుండా అన్నీ తన స్నేహితులకు చెప్పుకుంటే నాకెలా అర్థమవుతుంది. పెండ్లయి పదేండ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆయన ఇష్టాఇష్టాలు కూడా నాకు తెలియదు. ఏ విషయం అయినా వాళ్లకు చెబుతాడు. చివరకు మా ఫిజికల్ లైఫ్ గురించి కూడా తన స్నేహితులతో పంచుకుంటున్నాడు. ఆ విషయంలో అయినా నా ఇష్టం గురించి అడగడు. అసలు ఆయనకు నేనొకదాన్ని ఇంట్లో ఉన్నాననే విషయమే తెలుసో లేదో నాకు అర్థం కావడం లేదు. ఇలా ఇబ్బందులు పడుతూ విడాకులు తీసుకోవల్సింది నేను కదా! కానీ ఆయన నా నుండి విడిపోతా అంటున్నాడు. ఈ విషయం కూడా తన స్నేహితులు చెబితేనే నాకు తెలిసింది. నేనంటే ఆయనకు చాలా చులక భావం. ఇలాంటి వ్యక్తితో ఉండటం చాలా కష్టం. అందుకే ఆయన అడిగినట్టు విడాకులు ఇచ్చి నా బతుకు నేను బతుకుతాను’ అంది.
ఇద్దరి మాటలు విన్న తర్వాత కూర్చోబెట్టి ‘మీ ఇద్దరి మధ్య సమస్యకు కారణం మనసు విప్పి మాట్లాడుకోకపోవడం. మీరు కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు. తల్లిదండ్రులు కూడా. ఆ విషయం మర్చిపోతున్నారు. మీరిద్దరూ విడిపోతే పిల్లల పరిస్థితి ఏంటీ? ఆకాష్ ముందు మీరు మీ భార్యతో ఎలాంటి సమస్య వచ్చినా ఆమెతోనే చెప్పండి. ఆమెకు చెప్పడం రాకపోతే మా దగ్గరకు రండి. అంతే కానీ స్నేహితులతోనో, మీ అక్కతోనే ఇక చెప్పకండి. దీని వల్ల మీ మధ్య సమస్యలు మరింత పెరుగుతాయి. నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన విషయాలు బయటి ప్రపంచానికి తెలిసిపోతే మీకు సమాజంలో విలువ ఉండదు. మీ స్నేహితులకు చెబితే మీపై జాలి పడతారని మీరు అనుకుంటు న్నారు. కానీ అదే పనిగా మీ వ్యక్తిగత విషయాలు చెబితే మీరు వాళ్లకు చులకనైపో తారు. విడిపోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. మీరు కాస్త అర్థం చేసుకొని ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటే కలిసి ఉండడంలో ఉండే ఆనందం ఏంటో మీకు తెలుస్తుంది’ అని చెప్పాము.
అలాగే లతతో ‘మీ భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకోవల్సిన బాధ్యత నీకు ఉంది. మీ అత్త గారిని, మీ ఆడపడుచును అడిగి ఆకాష్ ఇష్టా లేంటే తెలుసుకోవల్సిన అవసరం నీకు ఉంది. అప్పుడు అతనికి నచ్చింది చేసి పెట్టొచ్చు. అతను మీతో మాట్లాకపోతే మీరే మాట్లాడించే ప్రయత్నం చేయండి. పదేండ్ల నుండి కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఇద్దరూ ఆ మాత్రం మాట్లాడుకోకపోతే ఎలా? అనవసరంగా ఏవేవో ఊహించుకుని సంసారాన్ని చేతులారా పాడుచేసుకోవద్దు’ అని సర్ది చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051