– మండుటెండలో సైతం లెక్కచేయకుండా పర్యటన
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని బీరెల్లి, రంగాపూర్ గ్రామపంచాయతీలలో గల చెరువులు, కుంటలను నీటిపారుదల శాఖ అధికారులు మరియు తాడ్వాయి ప్రత్యేక అధికారి, అల్లెం అప్పయ్య స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులతో శనివారం పర్యటించి, కుంటలను, చెరువులను పరిశీలించారు. గతంలో నీటిపారుదల శాఖ అధికారులు బీరెల్లి కొత్త కుంట 8.4 లక్షలు, వీరాపూర్ లక్ష్మి కుంట 31.6 లక్షలు, రంగాపూర్ పెరమళ్ళకుంట 29 లక్షలు, రంగాపూర్ నారాయణగుంట 13.4 లక్షలు, నర్సాపూర్ గౌరారం ఆనకట్ట 2.85 లక్షలు ఎస్టిమేషన్(ప్రతిపాదన) పంపారు. వాటిని పరిశీలించడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో చెరువులు, కుంటలను పరిశీలించడానికి నీటిపారుదల శాఖ డిఇ ఎగ్గడి సదయ్య, ఏఈ ల తో కలిసి మండల ప్రత్యేక అధికారి, జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య బృందం, స్థానిక సర్పంచులు, బీరెల్లి సర్పంచ్ జాజ చంద్రం, రంగాపూర్ సర్పంచ్ అశ్విని సూర్యనారాయణ లతో కలిసి కుంటలు చెరువులను మండుటెండలో కూడా లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రత్యేక అధికారి అల్లెం అప్పయ్య మాట్లాడుతూ చెరువులు కుంటలకు మత్తడులు, తూములు, కట్టలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి వచ్చే వర్షాకాలం రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. చెరువులు కుంటలతో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే వరి కాలం సీజన్లో పంటలు సమృద్ధిగా పండించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జాజ చంద్రం, ఇర్ప అశ్విని సూర్యనారాయణ, నరసింహ స్వామి, ఐబీఏఈలు అరవింద్, ప్రశాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు.