వీఓఏల సమస్యలు పరిష్కరించాలి

– అర్హులైన వారిని సీసీలుగా ప్రమోషన్‌ కల్పించాలి
– అఖిల భారత వ్యవసాయం కార్మిక సంఘం పధాన కార్యదర్శి బీ.వెంకట్‌
నవతెలంగాణ-నల్లగొండ
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐకేపీ వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ.వెంకట్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీస్‌ బేరర్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,608 మంది ఐకేపీ వీవోఏలు గత 20 ఏండ్లుగా పనిచేస్తున్నారని, వీరికి ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, ప్రమోషన్లతో పాటు, సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించలేదన్నారు. వీటి సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వీఓఏలు చాలా కాలంగా పలు నిరసన కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో గత 34 రోజులుగా మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మెకు పూనుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తూ, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పిస్తున్నారని, సభ్యులకు లోన్లు ఇప్పించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల లావాదేవీలన్నీ రికార్డు చేస్తూ ఎస్‌హెచ్‌ఐ లైవ్‌ మీటింగ్‌ పెట్టి ఆన్‌లైలో ఎంట్రీ చేస్తు సంఘాల పనులే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలయ్యేలా కృషి చేస్తున్నారని అయినా వీరికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) నుండి కేవలం రూ.3,900లు మాత్రమే గౌరవవేతనం ఇస్తూ చేతులు దులుపుకుంటుదని విమర్శించారు. గ్రామసంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వీఏవోల వ్యక్తిగత ఖాతాల్లోకి కనీస వేతనం రు.26వేలు చెల్లించాలని, వీరిని సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులివ్వాలివ్వడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రూ.10లక్షల సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జాబ్‌ చార్టర్‌తో సంబంధం లేని ఆన్‌లైన్‌ పనులను వీరితో చేయించొద్దని, వీరిపైన మహిళా సంఘాల ఒత్తిడి లేకుండా ఎస్‌హెచ్‌జీలకు వీఎల్‌ఆర్‌, అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోషన్‌ కల్పించాలని కోరారు. వెంటనే వీఓఏల న్యాయమైన డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, మహిళా కూలీలా జిల్లా కన్వీనర్‌ దండంపల్లి సరోజ, ఆఫీస్‌ బేరర్స్‌ కత్తుల లింగస్వామి, పిల్లుట్ల సైదులు, జటావత్‌ రవినాయక్‌, చింతపల్లి లూర్దు మారయ్య, మన్యం బిక్షం, గండమల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love