ప్రపంచాన్ని కుదుపుతున్న కృత్రిమ మేధ పయనం ఎటు?

న్యూయార్క్‌ : మన జీవితకాలంలోనే కృత్రిమ మేధ కల్లోలాన్ని సృష్టించగలదని చాలా మంది విశ్వసిస్తున్నారు. అయితే మనం అది సృష్టించబోయే కల్లోలం గురించి ఆలోచించి నప్పుడు సమస్య సాంకేతికత అభివృద్ధిలో లేదని అర్థమౌ తుంది. ఒక ప్రత్యేకమైన రాజకీయార్థిక వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టినప్పుడు అది కొన్ని సార్లు ప్రమాదకర మైనదిగా మారుతుంది. సూటిగా చెప్పాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు కృత్రిమ మేధను నియంత్రించే శక్తి, సామర్థ్యాలు ఉండవు. కృత్రిమ మేధకు వర్తమాన యుగాన్ని నిర్వచించే స్థాయి ఉందని ఒప్పు కుంటూనే దానితో వచ్చే కుంగుబాట్లు, ప్రమాదాలు కూడా ఉంటాయనేది సుస్పష్టం.
ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ మార్చి నెలలో ఒక బహిరంగ లేఖను ప్రచురించింది. జిపిటి-4 స్థాయిని మించిన కృత్రిమ మేధపై పనిచేసే ప్రయోగశాలలు ఆరు నెలలపాటు తమ పరిశోధ నలను నిలిపివేయాలని ఆ బహిరంగ లేఖ కోరింది. ఇటువంటి స్థాయిలో అభివృద్ధి చేయబడిన కృత్రిమ మేధతో మానవాళి ఎదుర్కోబోయే ప్రమాదాలను ఈ కాలంలో అధ్యయనం చేయాలనే ఆలోచనతో ఈ లేఖను విడుదల చేశారు. ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ సలహాదారుడైన ఇలోన్‌ మస్క్‌ తో సహా అనేక వందలమంది ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు.
కృత్రిమ మేధ తన సృష్టికర్తల నియంత్రణలో కూడా ఉండకుండా చెలరేగే అవకాశం ఉంటుందని ఫోర్బ్స మ్యాగజైన్‌ రాసింది. అంతేకాకుండా అస్థిత్వంలోగల వివక్షలను, అసమానతలను పెంచిపోషించేదిగా, తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించేదిగా, రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేదిగా కృత్రిమ మేధ అవతరించే అవకాశం ఉంది. అది హ్యాకర్స్‌కు సహకరిస్తుంది. దీర్ఘకాలం లో మానవాళి అస్థిత్వానికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని కొందరు నిష్ణాతులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకీ ఆకస్మిక గందరగోళం? ఇది నియమ, నిబంధనలు, నియంత్రణలకు సంబంధించిన విషయం. నియంత్రణ ఎవరి చేతుల్లో ఉండాలి? ఈ బహిరంగ లేఖ సూచించిన ఆరు నెలల్లో ”కృత్రిమ మేధతో వచ్చే ప్రమాదాల గురించి మానవాళి ఎలా అధ్యయనం చెయ్యాలి? రహస్యంగా కృత్రిమ మేధ మీద పరిశోధించే ఐటి ప్రయోగ శాలల మాటేమిటి? ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ స్థాయిలో చర్చ జరగటం, అందరూ పాటించవలసిన నిర్దేశాలను రూపొందించటం ఊహాతీతం. అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి?
2017లో ఇజ్రాయిలీ చరిత్రకారుడు యువల్‌ నోవా హరారీ(ఈయన పైన పేర్కొన్న బహిరంగ లేఖపై సంతకం చేసినవారిలో ఉన్నాడు) రాసిన ”హౌమో డెయుస్‌- రేపటి సంక్షిప్త చరిత్ర” అనే గ్రంధంలో కృత్రిమ మేధను గురించి వివరించాడు. అభివృద్ధి చెందిన కృత్రిమ మేధతో సమాజంలో వర్గబేధాలకంటే తీవ్రమైన చీలిక వస్తుందని ఆయన రాశాడు. రానున్న రోజుల్లో బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ అల్గోరిథమ్స్‌ కలయికతో ”దేహాలు, మేధస్సు, సౌందర్యం” ఉత్పత్తి అవుతాయి. వీటిని ఉత్పత్తి చేయటం తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్ళకు మధ్య తారతమ్యాలు నాటకీయంగా పెరుగుతాయి. ఇలా ”ప్రగతిని ముందుకు తోసుకుపోగల” వాళ్ళకు సృష్టించటం, నిర్మూలించటం వంటి ”దైవ సామర్థ్యం” సొంతం అవుతుంది. అలా చేయగలగటం చేతకాని వాళ్ళకు బ్రతకటమే భారం అవుతుంది. ఇలా ”ప్రగతిని ముందుకు తోసుకుపోగల” వాళ్ళు సృష్టించిన వాటిని తమ నియంత్రణలో ఉంచుకోగల సామర్థ్యం కొరవడినప్పుడు ఏర్పడే పరిస్థితి పట్ల వ్యక్తపరిచిన ఆందోళనే ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ జారీ చేసిన బహిరంగ లేఖలో వ్యక్తమైంది. కృత్రిమ మేధతో పెట్టుబడిదారీ వ్యవస్థ అంతం దిగంతంలో దర్శనమిస్తోంది. స్వయంచాలక కృత్రిమ మేధకు మానవ ప్రమేయంతో పెద్దగా అవసరం ఉండదు. స్టాక్‌ ఎక్ఛ్సేంజ్‌లో వ్యాపారం స్వయం చాలకంగా కొనసాగటం మొదటి మెట్టుగా ఉంటుంది. సూడో మానవ భాగస్వాము లనే మెషిన్లతో చేసే చర్యా, ప్రతిచర్యలతో కూడిన సంబంధాలు నెలకొన్నటువంటి (ఇదో తరహా కమ్యూనిస్టు) వ్యవస్థ ఆవిర్భావానికి దారితీస్తుంది. భావి శాస్త్రవేత్తకు లేక ఇంజినీర్‌కు తన సృష్టితో తాను సంభ్రమాశ్చర్యచకితుడయ్యే అవకాశం ఉంటుంది. అదే అతని సృష్టి సామర్థ్యానికి గీటురాయిగా ఉంటుంది.
మనం భవిష్యత్తును ఖచ్చితంగా ఊహించలేక పోయి నప్పటికీ ఒకటి మాత్రం సుస్పష్టం. కృత్రిమ మేధ ఒకానొక స్థాయికి చేరుకున్నాక మన ప్రాపంచిక దృక్పథంలో పాతు కుపోయిన ”మనిషి, భగవంతుడు, ప్రకృతి” కను మరుగ వుతాయి. బయోజనెటిక్స్‌ కారణంగా పరిశీలించ జాలని ప్రకృతి నేపథ్యంలో మన మానవత అస్థిత్వంలో ఉంటుంది. జీవితం సాంకేతికతతో మార్చుకోగలిగేలా ఉంటుంది. మానవ జీవితం, ప్రాకృతిక ప్రపంచం తమ ”ప్రాకృతిక” స్వభావాన్ని కోల్పోతాయి. భగవంతుడి స్థానంలో సృష్టించ గల, నిర్మూలించగల దైవ సామర్థ్యం మనిషి సొంత మౌతుంది. అది దైవత్వ భావనను మట్టుబెడుతుంది!.

Spread the love