– డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి
– 20 రోజులకు చేరుకున్న జీపీ కార్మికుల నిరవధిక సమ్మె
– కడ్తాల్‌లో కొనసాగుతున్న దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు
నవతెలంగాణ-ఆమనగల్
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో జీపీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపడుతున్న దీక్షా శిబిరాన్ని మంగళవారం కాంగ్రెస్ నేతలు సందర్శించి వారికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ కార్మికులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన రాస్తారోకోను ఉద్దేశించి డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీ సభ్యులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తొమ్మిది సంవత్సరాలకు పైగా నామ మాత్రం వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్న పంచాయతీ కార్మికులు గత 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం అన్నారు. ఎండ, వాన, చలి అన్ని కాలాలలో రాత్రి పగలు అనే తేడాలేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఊరి కోసం, ఊరి ప్రజల కోసం పనిచేసే కార్మికులను పట్టించుకోకపోవడం దురదష్టం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే జీపీ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింప చేస్తామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీపీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని శ్రీనివాస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, నాయకులు శేఖర్, సత్యం యాదవ్, రాజేష్, భానుకిరణ్, శ్రీకాంత్, శివ, నరసింహ, రమేష్, మహేష్, సీఐటీయూ నాయకురాలు కేతావత్ పుష్ప, సీఐటీయూ మండల కో కన్వీనర్ ఆశిర్వాదం, మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు మంజుల, చంద్రకళ, సరస్వతి, వెంకటమ్మ, అనసూయ, లక్ష్మమ్మ, శివనీల, చెన్నయ్య, అంజయ్య, మహేష్, కుమార్, కష్ణ పాల్గొన్నారు.