‘ది కేరళ స్టోరీ’ కల్పితమే

– డిస్‌క్లయిమర్‌ ప్రదర్శించాలని నిర్మాతలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ‘ది కేరళ స్టోరీ’ చిత్రం పూర్తిగా కల్పిత కథాంశంతో తెరకెక్కించిన సృజనాత్మక సృష్టిగా డిస్‌క్లయిమర్‌ ప్రదర్శించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆ చిత్ర నిర్మాతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేరళలో 32 వేల మంది మహిళలను ఇస్లాం మతంలోకి మార్చారని చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత లేదని కూడా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయాలను సూచిస్తూ డిస్‌క్లయిమర్‌ ప్రదర్శించాలని చిత్ర నిర్మాతలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా డిస్‌క్లయిమర్‌తో చిత్రానికి మార్పులు చేయాలని ఆదేశించింది. కాగా ఈ చిత్ర ప్రదర్శనపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టు స్టే విధించింది. అలాగే తమిళనాడులో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ‘ది కేరళ స్టోరీ’ చిత్ర నిర్మాతలు, తమిళనాడులోని థియేటర్ల యజమానులు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. ఈ చిత్రంలో ‘కేరళలో 32 వేల మంది మహిళలను ఇస్లాంలోకి మార్చారు’ అంటూ పేర్కొన్నారని, ఇది పూర్తిగా వాస్తవాలను వక్రీకరించడమేనని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ఇలంటి వక్రీకరణలపై ‘మీరేం చేస్తున్నారు’ అంటూ చిత్ర నిర్మాతల తరపున హాజరైన న్యాయవాది హరీష్‌ సాల్వేను జస్టిస్‌ చంద్రచూడ్‌ నిలదీశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించేందుకు తామున్నామని, కానీ అదే పేరుతో సమాజంలో ద్వేషం రెచ్చకొట్టాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. మతమార్పిడులకు సంబంధించి ఎలాంటి ప్రామాణిక సంఖ్య లేదని న్యాయవాది సాల్వే కూడా అంగీకరించారు.

Spread the love