– రెండింతలైన కౌలు..
– అప్పులపాలై చివరికి పట్టణాలకు వలస..
– కౌలుదారుల కన్నీటి కష్టాలు
– ఉపాధి లేక కౌలుకు తీసుకొని రైతుల సాగు
– రైతుబంధు సాయం కోసం ఎదురుచూపులు
– ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ- మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయరంగంలో కౌలురైతుల పాత్ర కీలకంగా మారింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్రలో ఎక్కువమంది కౌలు రైతులు ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ వారి సంఖ్య పెరిగింది. 36శాతం మంది కౌలువ్యవసాయం చేస్తున్నవారు ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌలు రైతులను గుర్తించడం లేదు. గతంలో పహాని కాలంలో కౌలు రైతు వివరాలు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కౌలు రైతు పంట నష్టపోతే ఆ పంటను చూసి పట్టదారుకు పరిహారం వస్తుంది తప్ప కౌలు రైతులకు ఏమాత్రం రాదు. బ్యాంకులు సైతం పంట రుణాన్ని పట్టాదారుకే అందజేస్తారు. ఇక విత్తనాలు ఎరువులు సైతం పట్టాదారు పాసుపుస్తకాలు చూసే అందజేస్తారు. పంటను కూడా దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రైతుభీమా కానీ, రైతు బంధు కానీ అందడం లేదు. సాగు చేసినా, చేయకున్నా పట్టా ఉన్న రైతులకే రైతుబంధు, ఇతర సౌకర్యాలు అందుతున్నాయి. గతంలో రైతులు కాని వారికీ రైతుబంధు అందింది. కానీ వ్యవసాయం చేస్తున్న కౌలురైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు రైతుబంధు సాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. కౌలు రైతులకు అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పిన నేపథ్యంలో.. ఏ రకంగా వారిని గుర్తిస్తారనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రజాపాలనలో రైతుబంధు కోసం రెండు లక్షల మంది కౌలురైతులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రంగా నష్టపోతున్న తమను ఆదుకోవాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జీవనోపాధి కోసం ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతులు భూములను కౌలుకు తీసుకొని పత్తి , మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 80 మంది శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అందులో 50 శాతానికి పైగా పట్టాదారుల నుంచి భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నవారు ఉన్నారు. గద్వాల, నారాయణపేట నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా సాగు చేసుకుంటున్నారు. పదేండ్ల క్రితం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 72 వేల మంది కౌలు రైతులు ఉండేవారు. ఒక గద్వాల జిల్లాలోనే 56,000 మంది పైగా కౌలు రైతులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ 2010-11 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కేవలం 6200 మందిని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కౌలు రైతులను గుర్తించడమే మానేశారు. వారికి భరోసా లేకుండా పోయింది. కౌలుదారుల గుర్తింపునకు ఒక విధానం అమలులో లేకపోవడం వల్ల వీరి ఆర్థిక పరిస్థితులు దయనీయంగా మారాయి. దీంతో పట్టాదారులకు కౌలు చెల్లించలేక సతమతమవుతున్నారు. పెట్టుబడులు పెరగడం, కనీసం మద్దతు ధర లేకపోవడం తదితర కారణాలవల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ధరణి విధానంలో రైతు పాసుబుక్కులు, పహానిలు, ప్రభుత్వ రికార్డుల్లో కౌలు కాలంను తీసేశారు. దీంతో కౌలు రైతులకు కనీసం గుర్తింపు లేకుండా పోయిందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అధికమైన కౌలు..
పదేండ్లకాలంలో కౌలు రైతులకు ప్రభుత్వ సహకారం అందకపోగా కౌలు రైతులకు పట్టాదారుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఎకరాకు కౌలు 10,000 తీసుకునే పట్టాదారులు రెండింతలు పెంచారు. సాగునీటి సౌకర్యం లేని నారాయణపేట జిల్లాలో సైతం ఎకరాకు 15,000 వసూలు చేయడం ఇబ్బందిగా ఉందని కౌలురైతులు ఆవేదన చెందుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మెట్ట అయితే రూ. 25 వేలకు పైగానే కౌలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేక పట్టాదారులు సహకరించ కపోవడం వల్ల కౌలు రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దుక్కులు దున్నడం మొదలుకొని పంట చేతికి వచ్చేదాకా వడ్డీ వ్యాపారస్తులను నమ్ముకొని సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎరువులు, విత్తనాల కోసం దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
చివరికి అప్పు తీర్చలేక సొంతపొలాన్ని..
తాడూరు మండలం గుంతకోడూరు గ్రామంలో రైతు వెంకటేష్ తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. గత ఏడాది మూడెకరాల్లో పత్తి మరో మూడు ఎకరాల్లో మిర్చి, ఒక ఎకరంలో కూరగాయలు సాగు చేశాడు. ఎకరాకు రూ. 25 వేల కౌలు ముందే చెల్లించాడు. వర్షాలు సరిగ్గా లేక మద్దతు ధర రాక కౌలుతోపాటు పెట్టుబడి కలిసి రెండున్నర లక్షల అప్పుల పాలయ్యాడు. అప్పు తీర్చలేక తనకున్న పొలాన్ని ఇతరులకు మార్ట్ గేజ్ కింద రిజిస్ట్రేషన్ చేశారంటే కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.
అప్పులపాలై హైదరాబాద్కు వలస..
గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామంలో వెంకటయ్య ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని విత్తనపత్తిని సాగు చేశారు. పెట్టుబడి నాలుగు లక్షల దాకా అయింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మూడు లక్షలు వడ్డీ వ్యాపారస్తులకు అప్పయ్యాడు. కౌలు చెల్లించలేదు అని ఈసారి రైతు సైతం భూమిని ఇవ్వలేదు. తీసుకున్న అప్పు చెల్లించాలని వడ్డీ వ్యాపారస్తులు ఒత్తిడి చేయడంతో హైదరాబాద్కు వలస పోయాడు. ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు.
రైతుబంధు మాదిరిగా మాకు ఒక పథకం పెట్టాలి
రైతు భరోసా మాదిరిగా కౌలు రైతులకు ఒక పథకాన్ని మాకు పెట్టాలి. ముఖ్యంగా గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా బ్యాంకులో రుణం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సాగు చేసుకున్న రైతులకే సహకారమందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
చింతకాయల వెంకటేష్, గుంతకోడూరు, నాగర్కర్నూల్ జిల్లా
నష్టాలు మాకు, ప్రతిఫలాలు పట్టాదారుకు ..
సాగు చేసి నష్టపోతుంది కౌలుదారులు. ప్రభుత్వం అందించే రైతుబంధు, పంట నష్టపరిహారం పట్టాదారుకు ఇస్తున్నారు. ఇది సమంజసం కాదు. గత ఏడాది నేను నాలుగు ఎకరాల్లో విత్తనపత్తి వేస్తే రెండు లక్షల నష్టం జరిగింది. అధికారులు అంచనా వేసి నివేదిక ఇచ్చారు సహాయం మాత్రం పట్టాదారుకే వచ్చింది. మాకు ఏ మాత్రం రాలేదు.
వెంకటయ్య , ఎర్రవల్లి చౌరస్తా గద్వాల జిల్లా