విద్యోదయ పాఠశాలలో పేర్చిన అతి పెద్ద బతుకమ్మ

నవతెలంగాణ జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ విద్యాసంస్థలలో గురువారం రాత్రి ముందస్తు బతుకమ్మ సంబరాలను ఆ పాఠశాల డైరెక్టర్ ఏ బూసి జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని అతిపెద్ద బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చారు. బతుకమ్మలను మధ్యలో పెట్టి చుట్టూ ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ  పాటలతో ఆడి, పాడారు. ఈ సందర్భంగా విద్యోదయ విద్యాసంస్థల చైర్మన్ ఏ బూసి రామస్వామి మాట్లాడారు.తెలంగాణ సాంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అలాంటి బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు .  తెలంగాణ ప్రాంత ప్రజలకు బతుకమ్మ పండగ ఎంతో ప్రాముఖ్యత గల పండుగ అని చెప్పారు. విద్యార్థులకు విద్యతోపాటు మన సాంప్రదాయాలను సంస్కృతిని  విద్యార్థులకు పండగల యొక్క విశిష్టతను తెలపడం పాఠశాల యాజమాన్యం బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ ఏ బూసి ఆర్యన్ కౌశిక్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love