నవతెలంగాణ-వీణవంక
చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందించాలని వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పలురు రైతులతో కలిసి వీణవంక మండలంలోని 15 గ్రామాల రైతులకు స్వర్గప్రదాయని అయిన కల్వల ప్రాజెక్టును ఆయన శుక్రవారం సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కల్వల ప్రాజెక్టు మత్తడి తెగిపోగా నీరు నిల్వ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం ప్రాజెక్టు మత్తడి నిర్మాణం కోసం సుమారు రూ.70 కోట్ల వరకు అంచనా వేసి నిధులు మంజూరు చేశారని, ఈ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయినప్పటికీ రైతుల బాధలు పట్టించుకోవడం లేదని, పనులను ప్రారంభించడం లేదని ఆరోపించారు. సాగు నీటి కోసం ఒక్కో రైతు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు రూ.5వేల వరకు ఖర్చు చేసి బోరు బావులు తవ్వుకుంటూ నష్టపోతున్నారని వాపోయారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేసి ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీణవంక, బ్రాహ్మణపల్లి గ్రామాల రైతులు గాజుల సమ్మయ్య, రెడ్డిరాజులు భిక్షపతి, గెల్లు మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.