చివరి పాదం

అభివృద్ధి అపోహను రాజ్యం రగిలిస్తే
ఆశతో రెక్కలను దహించుకుంటున్నవాడు
వాడెవడో సామాన్యుడంటా
సంక్షేమ రాజ్యంలో తన స్థానం ఏమిటో ఎరుగక
సామర్ధ్యాల పేరిట రోజు చస్తున్నవాడు
వాడెవడో సామాన్యుడంటా
రాజ్యాలను నిలబెట్టడానికి భుజాల నిచ్చి బూడిదైపోతున్నాడు
వాడెవడో సామాన్యుడంటా
నెత్తుటి చుక్కకు విలువ కట్టలేని ప్రపంచంలో
ఆకలొక్కటే వసంతం అనుకున్నాడు
వాడెవడో సామాన్యుడంటా
ఎక్కడుంటాడు?
ఎలా ఉంటాడు?
ఎవరతడు?
అదిగో గుండెలను బాదుకుంటూ బండలెత్త్తుతున్నాడు
ఎండిన డొక్కలతో పొలాలు దున్నుతున్నాడు
పేగులను పోగుగా చేసి మగ్గాల మీద మగ్గిపోతున్నాడు
నాగరికత పేరుతో అనాగరికమైన
నగరాల నడిబొడ్డున యంత్రమై తిరుగుతున్నాడు
ఆవాసము, నివాసము తెలీదు
ప్రవాసమొక్కటే ఊపిరి
ఊరు తెలీదు వాడ తెలియదు
వారసత్వం వలస జీవనాన్ని
అతను వసంతం ఎట్లా అనుకున్నాడో
దెబ్బతీస్తున్న ప్రతిసారి బాధితుడయ్యాడు
దివాలా తీస్తున్న ప్రతిసారి బాధ్యతయ్యాడు
పిచ్చివాడు
పేదరికాల మీదే ప్రభుత్వాలు
నిలబెడతాయని తెలుసుకోలేకపోయాడు
కుతంత్ర రాజ్యం కుటిల పన్నాగాలు పన్నినా
ఆర్థిక వ్యవస్థలు నిలబెట్టడానికి
తన అరచేయిని ఆసరాగా ఇస్తూనే ఉన్నాడు
అయినా అన్నార్తుల కన్నుల్లో కాకుల్లా పొడుస్తూ
దారిద్య్రం మీద దివాలా తీసిన రాజ్యాన్ని ఉంచి
వాడెవడు వాళ్ళ దేహాల మీదుగా అంతస్తులు కడుతూ
అంతరిక్షాన్ని చూయిస్తూ అభివద్ధి అంటున్నాడు
ఆకలి శిథిలాల కింద సామాన్యుడొకడు
కుళ్ళి కుళ్ళి అస్తిపంజరమై
పగలబడి నవ్వి నవ్వి చప్పట్లు కొడుతూ
ఓ వెన్నెల రాత్రి ఆకాశాన్ని చూస్తూ
ఈ అనంతయాత్రకు ముగింపు పలికే
చివరి పాదం ఎవరిదో అంటూ
రేపటి కాలానికి ఎర్ర రంగును పూస్తూ వెళ్లిపోయాడు.
– పి.సుష్మ, 9959705519

Spread the love