లాస్ట్‌ సప్పర్‌

లాస్ట్‌ సప్పర్‌”రండన్నయ్య. లోపలికి రండి, సోఫాలో కూర్చోండి” అని డోర్‌కి అడ్డుగా ఉన్న కర్టెన్‌ని ధర్వాజ పక్కకి నెట్టి ”అమ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చారు” అని కేక వేసి చెప్పి లోపలికి వచ్చింది మధు.
ముగ్గురు అన్నయ్యలు షూ, షాక్స్‌ విప్పి లోపలికి వొచ్చి కూర్చున్నారు.
పెద్ద గడియారంలో టైం ఏడుగంటల రెండు నిమిషాలు అని చూపెడుతుంది. లైట్స్‌ అన్నీ వెలగుతూ ఉండటం వల్ల ఆ గదంతా తెల్ల చీర కట్టుకున్న స్త్రీలా మెరిసిపోతోంది.
గోడకి పోస్టర్‌ అంటించినట్టు టీవీ గోడకి వేలాడుతూ ఉంది. దాన్నానుకొని ఫిష్‌ ట్యాంక్‌ ఉంది. మదిలో ఆలోచనల్లాగే ఆ గది అక్వేరియంలో ఉన్న చేప పిల్లలు అటూ ఇటూ తిరుగుతు ఉన్నాయి.
ఇల్లు విశాలంగాను, ఇంట్లో వస్తువులు విలాసంగాను ఉన్నాయి.
మధుకి ఈ ముగ్గురు సొంత అన్నయ్యలు కాదు. వేరు వేరు చోట్ల నుండి చదువుకోడానికి ఒకే విశ్వవిద్యాలయంలోకి వచ్చిన వారు. మధు వీళ్ళకి జూనియర్‌. పరిచయం అయ్యిన దగ్గరనుండి ”అన్నయ్య… అన్నయ్య…” అంటూ వీళ్లకు దగ్గరయ్యింది.
రోజూ రుచిలేని హాస్టల్‌ భోజనం ఏం తింటారు అని మధు వాళ్ళ అమ్మతో చెప్పి, ఒప్పించి ఈ రోజు వాళ్ళని భోజనానికి పిలిచింది.
నీళ్ల సీసా తీసుకొని వచ్చి ‘బాబు ఇగో నీళ్లు తాగండి’ అంది మధు తల్లి. ముగ్గురు లేచి ‘నమస్తే అమ్మ’ అని నమస్కారం చేసి కూర్చున్నారు.
”మధు ఎప్పుడూ మీ గురించే చెప్తుంది బాబు” అని టీవీ ఆన్‌ చేసింది.
”మధు మంచి అమ్మాయి. బాగా చదువుతుంది” అన్నాడు బాలా. పక్కనే ఉన్న మధు బాలా అన్న మాటకి సన్నగా నవ్వుకుంది. మధు చెల్లలు దివ్య మాత్రం అవునా? అన్నట్టు ముఖం పెట్టింది. ఒక్క నిమిషం బాబు అని లోపలికి వెళ్ళింది తల్లి.
ముగ్గురు అన్నయ్యలు, మధు, దివ్య భోజనానికి కూర్చున్నారు. తల్లి వడ్డిస్తుంది. హాస్టల్‌ భోజనం తినలేక ఆకలి అణిచి పెట్టుకొని ఉన్న కడుపులు కనుక ఇష్టంగా తింటున్నారు.
”నెలలు గడిచిందమ్మా, ఇలాంటి భోజనం చేసి. ఇది ఎప్పటికీ మరిచిపోం” అన్నాడు బాలా.
”ఇది మీ ఇల్లు బాబు, మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రండి” అని గంటెతో చారు పోసింది.
దివ్య తొందర తొందరగా తింటుంది. ప్లేట్‌ చుట్టూ అన్నం మెతుకులు, చారు చుక్కలు పడ్డాయి. తల్లి అది చూసి ”అదేంటే? మన ఇంటి జీతగాడు హరిజన వెదవ తిన్నట్టు కరువు వచ్చినట్టు తింటున్నావు? అన్నం ఏమైనా కరువా?” అన్నది చిరాకుతో వొచ్చిన కోపంతో. తల్లి అన్నమాటకి మధు ఉలిక్కిపడి బాలా వంక చూసింది.
బాలాకి పొరబోయి దగ్గొచ్చింది. ”ఎవరో నిన్ను తలుచుకుంటునట్టున్నారు బాబు” అని నీళ్ల గ్లాసు చేతికి ఇచ్చింది.
నీళ్లు తాగి కళ్ళవెంట నీళ్ళని తుడ్చుకుంటూ ”వేరెవరో కాదు, మీరే నన్ను తలచుకున్నారు” అని చేయి కడిగాడు బాల.
చాలా సేపు మాట్లాడిన తరువాత ”చివరిసారిగా చెప్తున్నా ఈ సారి అన్నీ తెలుసుకున్న తరువాతే ఎవరినైనా అన్నయ్య అని పిలువు” అని చికాగ్గా లోపలికి వెళ్ళిపోయింది తల్లి.
– మారాబత్తుల పెద్దన్న

Spread the love