– ఉమ్మడి మెదక్ జిల్లాలో సమరశీల రైతు పోరాటాలు
– మల్లన్నసాగర్, నిమ్జ్ నిర్వాసితులకు అండగా ఎర్రజెండా
– సింగూరు జలాల కోసం కొట్లాట.. ధరణి సమస్యల ఆందోళనలు
– సింగూరు జలాలు మెతుకు సీమ హక్కు: గొల్లపల్లి జయరాజు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజా ఉద్యమాల సారధి… రైతాంగ పోరాటాల వారిధిగా సీపీఐ(ఎం) నిలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ అనేక సమరశీల రైతు ఉద్యమాల్ని నడిపింది. ఊర్లకు ఊర్లను ఖాళీ చేయించి రోడ్డున పడేసిన మల్లన్న సాగర్ ముంపు బాధితుల కన్నీళ్లు తుడిచి న్యాయం జరిగే వరకు అండగా నిలిచింది. అరెస్టులు, జైళ్లను ఖాతరు చేయకుండా నిర్వాసితుల పక్షమే నిలబడింది. నిమ్జ్ పేర పరిశ్రమల కోసం వేలాది ఎకరాల్ని అప్పనంగా లాక్కుంటే మెరుగైన పరిహారం ఇచ్చే వరకు భూములివ్వబోమంటూ బాధిత రైతులకు భరోసాగా సీపీఐ(ఎం) నిలిచింది. సింగూరు జలాలు మెతుకు సీమ హక్కు అని నినదిస్తూ నీటి కేటాయింపులు చేసి సాగునీరివ్వాలని అన్నదాతల గొంతుకైంది. అక్రమాల పుట్ట ధరణి అవకతవకలను సరిచేసి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలివ్వాలని పాదయాత్రలు, ఆందోళనలు నిర్వహించింది. త్రిబుల్ ఆర్ నిర్వాసితుల పోరాటాలకూ సీపీఐ(ఎం) అండగా నిలిచింది. మార్కెట్, మద్ధతు ధరలు, ఎరువులు, కల్తీ విత్తనాలు, కరువు కాటకాల వంటి సమస్యలపై సైతం సీపీఐ(ఎం) రైతుల వెన్నంటి ఉండి పరిష్కారానికి చొరవ చూపింది.
మల్లన్న సాగర్ పోరులో జైలు
మల్లన్నసాగర్ జలాశయ నిర్మాణం కోసం ఏటిగడ్డకిష్టాపూర్, రాంపూర్, ఎర్రవెల్లి, సింగారం, బ్రహ్మణ బంజేరుపల్లి, లక్ష్మాపూర్, పల్లెపహడ్, వేములఘాట్ వంటి గ్రామాల్లో సర్వం కోల్పోయిన నిర్వాసితులతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) కొట్లాడింది. సర్వం కోల్పోయిన రైతులు, కూలీలు, వృత్తిదారులకు చట్ట ప్రకారం నష్టపరిహారం, పునరావాసం, ఇతర బెనిఫిట్స్ కల్పించాలని సీపీఐ(ఎం) అనేక పోరాటాలు నడిపింది. అప్పటి ప్రభుత్వం కక్షకట్టి లాఠీలు ఝుళిపించినా పోరుబాట వదల్లేదు.
నిర్వాసితుల పక్షాన కొట్లాడిన నాయకుల్ని అరెస్టు చేసి జైళ్లో నెట్టినా తగ్గలేదు. సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, నాయకులు ఎ.మల్లేశం, గొడ్డుబల్ల భాస్కర్ 14 రోజుల పాటు జైలుకెళ్లారు. ఎర్రజెండా పోరాడిన ఫలితంగా రైతులతో పాటు కూలీలు, వృత్తిదారులకు సైతం అన్ని రకాల బెనిఫిట్స్ అందజేసేందుకు సర్కార్ అంగీకరించాల్సి వచ్చింది.
ఎర్రజెండా పోరాటం వల్లే నిమ్జ్ రైతులకు న్యాయం
జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) కోసం 12 వేల ఎకరాల భూముల్ని సేకరించాలని గుర్తించారు. జహీరాబాద్ ప్రాంతంలోని పలు మండలాల్లోని అనేక గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతుల భూముల్ని సేకరించడంతో సీపీఐ(ఎం) రైతుల్ని సమీకరించింది. చట్ట ప్రకారం పరిహారంతో పాటు అదనపు బెనిఫిట్స్ కల్పించాలని నిర్వాసిత గ్రామాల్లో పాదయాత్ర చేసింది. అధికారులపై వత్తిడి తెచ్చేందుకు జిల్లా కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర చేశారు. న్యాయపోరాటం సాగించి భూములకు మెరుగైన పరిహారం దక్కేలా ఎర్రజెండా పోరాడింది. ఇప్పటికీ నిమ్జ్ భూ బాధితులు సీపీఐ(ఎం) వెనకాలే ఉంటున్నారు.
సాగునీటి కోసం పోరాటం
17 టీఎంసీల నీటిని ఇతర జిల్లాలకు తరలిస్తున్న పాలకులు మెతుకు సీమ మెదక్ జిల్లాకు సింగూర్ జలాల్ని కేటాయించాలని, రైతాంగానికి సాగునీటి వనరులు పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) అనేక ఉద్యమాల్ని నడిపింది.
సుదీర్ఘ పాదయాత్ర ఫలితంగా నీటి కేటాయింపు జరిగినా అవి సద్వినియోగం కాలేదు. ఎడమ కాల్వకు నీళ్లివ్వాలని కూడా కొట్లాడింది. అదే విధంగా కరువు ప్రాంతంగా ఉన్న జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు సాగునీటి కోసం సంగమేశ్వర, బసవేశ్వర లిప్టు పథకాల్ని చేపట్టాలని ఆందోళనలు చేసింది. సీపీఐ(ఎం), రైతుల పోరాటాలతో గత ప్రభుత్వం ఆ రెండు లిప్టులకు నిధులు కేటాయించింది.
ధరణీ అవకతవకలు.. సమస్యలపై
ధరణీ వచ్చాక రైతులకు పట్టాదారు పాస్తుకాలు రాకుండా ఆగిపోయాయి. రైతుల పేరిట ఉన్న భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చడం, వోల్డ్‌లో పెట్టడం వంటి సమస్యలపై సీపీఐ(ఎం) అధ్యయనం చేసింది. మునిదేవునిపల్లి గ్రామ రైతుల సమస్యలపై కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. మాందాపూర్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత ఆ రెండు ప్రాంతాల రైతులకు పట్టాదారుల పుస్తకాలు జారీ చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో బిడకన్నె, మాచిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి వంటి గ్రామాల రైతుల సమస్యలపై ఆందోళనలు చేసి న్యాయం చేకూరేలా చేశారు.
సింగూరు జలాలు జిల్లా హక్కు
సింగూరు ప్రాజెక్టు జిల్లాలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అవసరాలకు సాగు, తాగునీటికి కేటాయింపులు సరిగ్గాలేదు. సీపీఐ(ఎం) మాత్రమే సింగూరు జలాల కోసం కొట్లాడింది. కేటాయింపులు చేసిన మేరకు వినియోగించుకునేందుకు అవసరమైన నీటి వనరుల్ని అభివృద్ధి చేయాలి. పెండింగ్ ప్రాజెక్టుల్ని సత్వరమే పూర్తి చేయాలని పోరాడుతున్నాం. త్రిబుల్‌ఆర్ భూ సమస్యపైన కూడా రైతులకు అండగా ఉన్నాం. రాష్ట్ర మహాసభల్లో తీసుకునే కర్తవ్యాలను మరింత ముందుకు తీసుకెళ్తాం.
– గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, సంగారెడ్డి