– నల్లగొండ జిల్లాలో మెరుగుపడని అక్షరాస్యత
– గత జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 14వ స్థానంలో జిల్లా
– త్వరలో ప్రారంభం కానున్న ఎన్ ఐ ఎల్ పి ప్రోగ్రాం
– 40771 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
మనిషి భవితవ్యానికి, ప్రపంచ ప్రగతికి మార్గదర్శకంగా, దేశ భవితవ్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచేదే అక్షరం. ఇంతటి విలువైన అక్షర సంపద నల్లగొండ జిల్లాలో ఇంకా ఎందరికో చేరువ కావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసినా పరిస్థితి మెరుగుపడటం లేదు. అక్షరాస్యత 63.70 శాతానికి మించడం లేదు. 2018 నుంచి సాక్షర భారత్ కార్య క్రమం నిలిచిపోగా, తిరిగి ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలూ చేపట్టలేదు. నల్లగొండ జిల్లా అక్షరాస్యత శాతం రాష్ట్రంలోనే 14 వ స్థా నంలో వుండి అత్యల్పంగా ఉంది.
మహిళలే అధికం..
నల్లగొండ జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగానే ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 818306 మంది పురుషులు, 800110 స్త్రీలు మొత్తం 16,18 416 జనాభా ఉంది. కాగా జిల్లాలో అక్షరాస్యత శాతం 63.70 గా వుంది. అయితే ఇందులో పురుషుల అక్షరాస్యత శాతం 73.85 కాగా, మహిళల అక్షరాస్యత శాతం 53.41 గా తక్కువగా ఉంది.పేదరికం, అవగాహనా లోపం కారణంతో ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని నేరేడు కొమ్ము, తిరుమలగిరి, సాగర్, అడవిదవులపల్లి, చందంపేట,
మండలాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది.
నవ భారత సాక్షరత అమలు చేస్తేనే..
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి 2010 నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1172 గ్రామ పంచయతీలలో సాక్షరభారత్ కేంద్రాలలో సుమారు 2400 మంది గ్రామ సమన్వయకర్తలను ఏర్పాటు చేసి, అక్షరాలు నేర్పించింది. ఎనిమిదేళ్ల పాటు ఈ కార్యక్రమం అమలు చేసినా ఆశించిన ప్రగతి కనిపించలేదు. దీంతో 2018లో కార్యక్రమం నిలిచిపోయింది. 2022 నుంచి కేంద్ర ప్రభుత్వo వయోజనులకు అక్షరాలు నేర్పించడానికి నవ భారత సాక్షరత(న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏటా కోటి మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే.. ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేక ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.
2011 జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా లో అక్షరాస్యత శాతం..
అడవిదేవులపల్లి 48 శాతం, అనుముల 65, చందంపేట 48, చండూరు 61, చింతపల్లి 56, చిట్యాల 67, దామరచర్ల 58, దేవరకొండ 64, గుండ్లపల్లి, గుర్రంపోడు 55, కనగల్ 59, కట్టంగూరు 63, కేతేపల్లి 62, కొండమల్లేపల్లి 56, మాడుగులపళ్లి 62, మర్రిగూడ 58, మిర్యాలగూడ 73, మునుగోడు 59, నకిరేకల్ 70, నల్లగొండ 80, నాంపల్లి 51, నార్కట్పల్లి 67, నేరేడు కొమ్ము 45, నిడమనూరు 64, పెద్ద ఆడిసర్లపళ్లి 53, పెద్దఊర 61, శాలిగౌరారం 62, తిప్పర్తి 63, త్రిపురారం 61, తిరుమలగిరి సాగర్ 47, వేములపల్లి 64 శాతంగా అక్షరాస్యత శాతం ఉంది.
40771 మందికి అక్షరాలు నేర్పించడమే లక్ష్యం..
నల్లగొండ జిల్లాలో నవభారత సాక్షారత (ఎన్ ఐ ఎల్ పి) కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నల్లగొండ జిల్లాకు 40771 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని టార్గెట్ ఇచ్చారు. ఇందులో 16,308 మంది పురుషులు కాగా, 24463 మంది మహిళలు ఉన్నారు. అధికారులు ఇప్పటికే మండలాల వారిగా సర్వేను ప్రారంభించారు. సర్వే పూర్తయిన అనంతరం ఆయా గ్రామాలలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆ పై చదువులు చదివిన యువతతో నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పించనున్నారు. నవభారత సాక్షరత కార్యక్రమం దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో 2022లో ప్రారంభమై 2027 వరకు కొనసాగుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 2024 నుండి ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉల్లాస్ యాప్ ను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
కేటగిరీల వారిగా..
జిల్లాకు ఇచ్చిన 40771 టార్గెట్ లో ఎస్సీ కేటగిరీకి సంబంధించి 2936 మంది పురుషులు, 4403 మంది మహిళలు, ఎస్టి కేటగిరికి సంబంధించి 1957 మంది పురుషులు కాగా 2936 మంది మహిళలు ఉన్నారు. అదేవిధంగా మైనార్టీ కి సంబంధించి 362 మంది పురుషులు కాగా 543 మంది మహిళలు, ఓబీసీకి సంబంధించి 4702 పురుషులు కాగా 7053 మహిళలు ఉన్నారు.
ఆదేశాలు రాగానే అమలు.. మమత (జిల్లా ప్రాజెక్టు అధికారి)
వయోజను లకు అక్షరాలు నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నవ భారత సాక్షరత కార్య క్రమం అమలుకు చేయాలని ఆదేశాలి చ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు చైర్మెన్ లుగా వుంటారు. విద్యాశాఖ సమన్వయంతో అవసరమైన సమీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్లైన్స్ పూర్తిగా రాలేదు. జిల్లా కలెక్టర్ కి ఫైల్ పెట్టాము. కలెక్టర్ ఆదేశానుసారం కార్యక్రమం ప్రారంభమవుతుంది.