నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసిన విషయాలను ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ ఉండాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే అన్నారు. శుక్రవారం నాడు సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ సంబంధించి 24 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ను కలిశారు. గత నెల 29 నుండి ఈరోజు వరకు ఐదు రోజులపాటు జిల్లాలోని తుర్కపల్లి మండలం ధర్మారం, రాజపేట మండలం దూది వెంకటాపురం, యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్, మోట కొండూరు మండలం వరటూరు, రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామాలలో గ్రామానికి ఐదుగురు సభ్యులు చొప్పున ఐదు రోజులపాటు క్షేత్రస్థాయిలో వారు అధ్యయనం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేయబడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, వైద్య సేవలు, పనితీరుపై అధ్యయన అనుభవాలను బృందం సభ్యులు తెలిపారు.
గ్రామస్థాయిలో మొక్కల పెంపకం, పచ్చదనం, గ్రామ పంచాయతీల నిర్వహణ, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీల ద్వారా ఇంటింటా తడి పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, కంపోస్ట్ షెడ్లు నిర్వహణ, వైకుంఠధామాలు బాగున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశాలు కావడం జరిగిందని, ఉపాధి హామీ పనులు, కూలీల చెల్లింపులు బాగున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ ఐదు రోజుల పాటు మీరు గ్రామాలలో చేసిన అధ్యయనం పేద ప్రజలకు ఉపయోగపడేలా, వారికి లాభం చేకూర్చేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్షేత్రస్థాయిలో అందిస్తున్న వైద్య సేవలు, మాతా శిశు సంరక్షణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎంఏ కృష్ణన్, జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రతినిధి పి వెంకటేశ్వర్లు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి జైపాల్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అడిషనల్ డి.ఆర్.డి.ఓ. సురేష్, అధికారులు పాల్గొన్నారు.